హైదరాబాద్: బాధతోనే తెలుగుదేశం పార్టీని వీడుతున్నట్టు రాజ్యసభ ఎంపీ గరికపాటి మోహన్‌రావు చెప్పారు. మనసు చంపుకొనే బీజేపీలోకి వస్తున్నానని అన్నారు. సుఖాల్లో లేనప్పటికీ చంద్రబాబు బాధల్లో మాత్రం తాను ఆయన వెన్నంటే ఉన్నానని చెప్పి ఆయన భావోద్వేగానికి గురయ్యారు. కష్టకాలంలో టీడీపీ వెంట ఉన్నది తెలంగాణ కార్యకర్తలేనని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. చంద్రబాబు అమరావతి వెళ్ళాక తెలంగాణాలో తెలుగుదేశం పార్టీ క్షీణించిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ చక్కగా ఉండాలనే తాను కోరుకుంటున్నట్టు చెప్పారు. తల్లి లాంటి పార్టీని వదిలి బీజేపీలోకి వచ్చానని వ్యాఖ్యానించారు. తెలంగాణలో బీజేపీ జెండా ఎగరేయడం ఖాయమని జోస్యం చెప్పారు.
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో భారతీయ జనతా పార్టీ నిర్వహించిన బహిరంగ సభలో గరికపాటి ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జగత్ ప్రకాశ్ నడ్డా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కొద్దిరోజుల క్రితమే బీజేపీలో చేరినట్టు ప్రకటించిన గరికపాటి.. ఈ సభలో నడ్డా సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. ప్రస్తుతం ఆయన రాజ్యసభలో బీజేపీ సభ్యునిగానే ఉన్నారు. పార్టీ కోసం పని చేసిన వారికి టికెట్లు ఇచ్చుకోలేని స్థితిలో టీడీపీ ఉందని గరికపాటి ఆరోపించారు. పదవుల కోసం బీజేపీలో చేరలేదని చెప్పారు. తన వెంట బీజేపీలో వచ్చిన టీడీపీ నాయకులకు న్యాయం చేయాలని కోరారు. గ్రేటర్‌లో బీజేపీ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఆయన ఆధ్వర్యంలో తెలంగాణలోని పలు జిల్లాలకు టీడీపీ నాయకులు బీజేపీలో చేరారు.