ప్రముఖ పరిశోధనా సంస్థ హిండెన్ బర్గ్ నివేదిక సంచలనం రేపుతోంది. ప్రముఖ వ్యాపార వేత్త ఆదానీకి చెందిన ఆదానీ గ్రూప్స్ తన షేర్లలో అక్రమాలకు పాల్పడిందని హిండెన్ బర్గ్ ఓ నివేదికను విడుదల చేసింది. అప్పటి నుంచి ఆదానీ కంపెనీ షేర్లు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నాయి. దీంతో పాటు స్టాక్ మార్కెట్ మొత్తాన్ని ఈ నివేదిక కుదిపిస్తోంది.
ఈ క్రమంలో గౌతమ్ ఆదానీ గురించి దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. జేబులో వంద రూపాయలతో ముంబై వచ్చి ఆసియాలోనే అతి పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని ఆయన ఏర్పరిచారు. ఆయన జీవిత ప్రస్థానంలో ఎత్తుపల్లాల గురించి ఓ సారి చూస్తే…
గౌతమ్ ఆదానీ గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జన్మించారు. ఆయన తండ్రి వస్త్ర వ్యాపారం చేసేవారు. కానీ తన తండ్రిలాగా వస్త్ర వ్యాపారం కాకుండా వేరే ఏదైనా కొత్తగా చేయాలని ఆయన ఆలోచించే వారు. ఆ కోరిక రోజు రోజుకూ పెరుగుతూ వచ్చింది.
ఆయనకు చదువు పట్ల పెద్దగా ఆసక్తి ఉండేది కాదని, కాలేజీలో చదువుతున్న సమయంలో ఫెయిల్ అయినట్టు తనకు ఎప్పడూ కలలు వస్తుండేవన్నారు. ఆ భయంతోనే కాలేజీకి సరిగా వెళ్లే వారు కాదని ఆయన పలు ఇంటర్వ్యూట్లో చెప్పారు. ఈ క్రమంలో ఇంటర్ సెకండియర్ లో ఫెయిల్ అయినట్టు చెప్పారు.
దీంతో ఏం చేయాలని బాగా ఆలోచించారట. ఆ తర్వాత జేబులో వంద రూపాయలతో ముంబైకి చేరుకున్నారు. ముంబైలో ఓ వజ్రాల వ్యాపారి వద్ద ఆయన పని చేశారు. ఆ క్రమంలో బిజినెస్‌కు కావాల్సిన మెలకువలను ఆయన నేర్చుకున్నారు. ఆ అనుభవం, మెలకువలతో ఆయనే స్వయంగా వజ్రాల వ్యాపారంలోకి దిగారు. ఆ తర్వాత అంచలంచెలుగా ఎదిగా ఆసియాలోనే నెంబర్ 1 వ్యాపార వేత్తగా ఎదిగారు.