పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీ ఇంట త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఆయన చిన్న కుమారుడు జీత్ అదానీ ఒకింటివాడు కానున్నారు. వజ్రాల వ్యాపారి జైమిన్ షా కుమార్తె దివా జైమిన్ షాతో ఆయన నిశ్చితార్థం ఈ నెల 12 న అహ్మదాబాద్ లో నిరాడంబరంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కుటుంబ సభ్యులతో బాటు అతికొద్దిమంది సన్నిహితులు మాత్రం హాజరయ్యారు. డైమండ్ ట్రేడర్ జైమిన్ షా.. సి. దినేష్ అండ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ అధినేతగా ఉన్నారు.
తమ నిశ్చితార్థం సందర్భంగా జీత్ అదానీ, దివా ఇద్దరూ సాంప్రదాయక దుస్తుల్లో ఫోటోలకు ఫోజులిచ్చారు. జీత్.. యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ అప్లైడ్ సైన్సెస్ నుంచి తన స్టడీ పూర్తి చేశారు. 2019 లో అదానీ గ్రూప్ లో చేరి.. గ్రూప్ ఫైనాన్స్ విభాగానికి వైస్ ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్నారు.
అదానీ ఎయిర్ పోర్ట్స్ బిజినెస్ తో బాటు అదానీ డిజిటల్ ల్యాబ్స్ లావాదేవీలను ఆయన పర్యవేక్షిస్తున్నారని అదానీ గ్రూప్ వెబ్ సైట్ తెలిపింది. అదానీ గ్రూప్ బిజినెస్ లకు సంబంధించిన కన్స్యూమర్లందరికీ ఈ డిజిటల్ ల్యాబ్.. సూపర్ యాప్ ని రూపొందించబోతున్నట్టు తెలుస్తోంది.
హిండెన్ బెర్గ్ రీసెర్చ్ నివేదికతో అదానీ సామ్రాజ్యం కకావికలమవుతున్న వేళ.. జీత్ అదానీ నిశ్చితార్ధ వేడుక వార్తల్లోకి వచ్చింది. ఇక దివా తండ్రి..జైమిన్ షా తన సి. దినేష్ అండ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ ని ముంబై, సూరత్ నగరాల్లో నిర్వహిస్తున్నారు.