పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీ రాజస్తాన్ రాష్ట్రానికి వరంగా మారారు. ఈ రాష్ట్రంలో రూ. 65 వేల కోట్ల పెట్టుబడులు పెడతామని ఆయన ప్రకటించారు. వచ్చే 5 నుంచి ఏడేళ్లలో ఈ రాష్ట్రంలో 10 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ కేంద్రం ఏర్పాటు, సిమెంట్ ప్లాంట్ విస్తరణ, జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధి వంటివి ఆయన ప్రకటించిన ‘వరాల వెల్లువ’ లో ఉన్నాయి. ప్రస్తుతమున్న, భవిష్యత్తులో పెట్టనున్న పెట్టుబడులే కాకుండా అదనంగా 65 వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్లు పెడతామని ఆయన చెప్పారు. వీటి కారణంగా ప్రత్యక్షంగా, పరోక్షంగా 40 వేలమందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు.
‘ఇన్వెస్ట్ రాజస్తాన్ 2022 సమ్మిట్’ పేరిట శనివారం జైపూర్ లో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మెడికల్ కాలేజీలు, ఆస్పత్రులు లేని జిల్లాల్లో రెండు వైద్య కళాశాలలను, ఆసుపత్రులను ఏర్పాటు చేస్తామన్నారు, ఉదయ్ పూర్ లో క్రికెట్ స్టేడియం ఏర్పాటుకు సహకరిస్తామని చెప్పారు. ఇదే వేదికపై ఉన్న సీఎం అశోక్ గెహ్లాట్.. ఆయనను ఆప్యాయంగా ;గౌతమ్ భాయ్’ అని వ్యవహరించారు. వాణిజ్య రంగంలో గౌతమ్ తనకు తానే సాటి అని ప్రశంసించారు. ఒకప్పుడు ధీరూభాయ్ అంబానీని, ఇప్పుడు ‘గౌతమ్ భాయ్’ వంటి పారిశ్రామికవేత్తలను గుజరాత్ రాష్ట్రం అందించిందన్నారు.
ఇప్పుడు మీకు గౌతమ్ అదానీ కావలసి వచ్చారా ? బీజేపీ
ఒకే వేదికపై అదానీ, గెహ్లాట్ కూర్చున్న ఫోటోలను చూసిన బీజేపీ.. మండిపడింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పదేపదే విమర్శించే పారిశ్రామికవేత్తతో ఈ ప్రభుత్వం చేతులు కలుపుతోందని ఈ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సతీష్ పూనియా విమర్శించారు. మీ ప్రత్యర్థి ఈ రోజు మీ ఫ్రెండ్ అయ్యారని, డబ్బులొస్తాయన్న ఆశతో వాళ్ళు (ప్రభుత్వం) తమ విధానం మార్చుకున్నారని ఆయన అన్నారు. గెహ్లాట్ పక్కసీటులోనే అదానీని కూర్చోబెట్టుకోవడం.. రోజూ ఇలాంటి పారిశ్రామికవేత్తలను దుయ్యబట్టే రాహుల్ కి ఓపెన్ మెసేజ్ అని బీజేపీ ఐటీ విభాగం హెడ్ అమిత్ మాలవీయ ట్వీట్ చేశారు.
ఈ సమ్మిట్ కి ముందే.. రాహుల్.. దేశంలో సామాన్యులు ఇబ్బందులు పడుతుంటే కేంద్రం తన కేపిటలిస్ట్ ఫ్రెండ్స్ కి కోట్లాది రూపాయల రుణాలను మాఫీ చేస్తోందని ఆరోపించారు. అయితే అదానీకి రాజస్థాన్ ప్రభుత్వం ప్రాధాన్యమివ్వడం సబబేనని ఆ తరువాత సమర్థించారు. కార్పొరేట్లకు తాను వ్యతిరేకం కాదని, గుత్తాధిపత్యాన్నే విమర్శిస్తున్నానని అన్నారు. అదానీకి ఈ సర్కార్ ప్రత్యేక ప్రాధాన్యమేమీ ఇవ్వలేదని, ఇలాంటి ఆఫర్ ని ఏ సీఎం కూడా వదులుకోరని ఆయన పేర్కొన్నారు. తప్పుడు విధానంతో అదానీకి ప్రభుత్వం బిజినెస్ ఇస్తే దాన్ని కూడా వ్యతిరేకిస్తానని ఆయన స్పష్టం చేశారు.
రాజస్తాన్ ఉజ్వల భవితవ్యాన్ని సాధిస్తుంటే ఎందుకు నిరాకరించాలని సీఎం అశోక్ గెహ్లాట్ ట్వీట్ చేశారు. రాష్ట్రంలో ఎవరు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చినా ఆహ్వానిస్తామన్నారు. అంబానీ లేదా ముకేశ్ అంబానీ.. చివరకు అమిత్ షా కొడుకు జే షా వచ్చినా ఇన్వైట్ చేస్తాం అని ఆయన పేర్కొన్నారు.