భారత్ ఆస్ట్రేలియా మధ్య ఈ ఏడాది ఆరంభంలో జరిగిన టెస్ట్ సిరీస్ లో భారత్ విజయం సాధించడం గర్వకారణం అని సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డారు. గబ్బా వేదికపై ఆసీస్ కు అదే తొలి ఓటమి కావడం.. ఆ విజయాన్ని భారత్ అందుకోవడం గర్వకారణం అని కొనియాడారు. భారత క్రికెట్ చరిత్రలో అది సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ప్రత్యేక అధ్యాయం అని అన్నారు. అయితే గబ్బా మళ్లీ ఆస్ట్రేలియన్ల కంచుకోటలా మారింది. యాషెస్ తొలి టెస్టులో ఆ జట్టు ఇంగ్లాండ్‌ను 9 వికెట్ల తేడాతో చిత్తు చేసి మూడున్నర రోజుల్లోనే విజయ కేతనం ఎగరేసింది.
ఇప్పుడు భారత్ దక్షిణాఫ్రికా పర్యటనకు సిద్ధమవుతోందని గవాస్కర్ అన్నారు. అక్కడ ఇప్పటిదాకా టీమ్‌ఇండియా సిరీస్ గెలవలేదు. 2011లో ధోనీ నాయకత్వంలో డ్రా అయింది. అది మినహాయిస్తే ప్రతిసారీ సిరీస్‌ను కోల్పోయింది భారత్. దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ఇప్పుడు చాలా బలహీనంగా మారిన నేపథ్యంలో ఈసారి భారత్ సిరీస్ గెలవడానికి మంచి అవకాశాలున్నాయని సూచించారు గవాస్కర్. టీమ్‌ఇండియా ప్రధాన బౌలర్లకు మరింత విశ్రాంతి లభించింది. వాళ్లు తాజాగా ఉన్నారు. సిరీస్ ఆరంభానికి ముందు మూడు రోజుల మ్యాచ్ ఒకటి ఉంటే బాగుండేది. కానీ కొవిడ్ కొత్త వేరియెంట్ ప్రభావం వల్ల ఇందుకు అవకాశం లేదు. బ్యాటింగ్‌కు అనుకూలమైన సెంచూరియన్‌లో తొలి టెస్టు ఆడబోతుండటం భారత్‌కు కలిసొచ్చే అంశం అని గవాస్కర్ పేర్కొన్నారు.