దేశంలో ఎక్కడా డిటెన్షన్ క్యాంపులు లేవని ప్రధాన మంత్రి నరేంద్ర చెప్పడంపై అస్సాం మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ స్పందించారు. విదేశాల నుంచి వచ్చిన అక్రమ వలసదారులను డిటెన్షన్ క్యాంపుల్లో పెట్టాలనే నిర్ణయం వాజ్ పేయ్ ప్రభుత్వంలోనే జరిగిందన్నారు. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత డిటెన్షన్ క్యాంపుల నిర్మాణానికి రూ.46 కోట్లు కేటాయించారని తరుణ్ గొగోయ్ వెల్లడించారు. 30000 మంది పట్టే అతిపెద్ద డిటెన్షన్ క్యాంప్ నిర్మిస్తున్నారని అన్నారు. ఈ రోజు దేశంలో ఎక్కడా డిటెన్షన్ క్యాంపులు లేవని మోదీ ఎలా చెబుతారని ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీకి చెందిన తరుణ్ గొగోయ్ 2001 నుంచి 2016 వరకు మూడు సార్లు అస్సాం ముఖ్యమంత్రిగా పనిచేశారు. తమ ప్రభుత్వమే హైకోర్టు ఆదేశాలతో డిటెన్షన్ క్యాంపుల నిర్మాణాలను చేపట్టిందని తెలిపారు. ఈరోజు ముఖం చాటేసేందుకు మోదీ అబద్ధాలు ఆడుతున్నారని విమర్శించారు.
మతం ప్రాతిపదికన అక్రమ వలసదారులను గుర్తించి డిటెన్షన్ క్యాంపుల్లో పెట్టకూడదన్నారు తరుణ్ గొగోయ్. డిటెన్షన్ క్యాంపుల్లో ముస్లింల కంటే హిందువులే ఎక్కువ ఉన్న మాట నిజమని..ఇప్పుడు హిందువులను ఎవరు నిర్బంధించారంటే బీజేపీ ప్రభుత్వమే. తన హయాంలో హిందూ-ముస్లిం తేడా లేదన్నారు. డిటెన్షన్ కోసం రూపొందించిన నిబంధనలు అంత కఠినంగ ఉండకూడదన్నారు. డిటెన్షన్ క్యాంపుల్లో ఉంచిన వారిని మూడేళ్ల తర్వాత విడుదల చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ఉందని తరుణ్ గొగోయ్ గుర్తు చేశారు.