తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మాజీ మంత్రి గీతారెడ్డి విమర్శలు గుప్పించారు. టీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ఆల్కహాలిక్ అత్యాచారాలకు హబ్ గా మారిపోయిందన్నారు. నగరంలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని ఆరోపిస్తూ.. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బచావో హైదరాబాద్ పేరుతో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
కేసీఆర్ కు తన కుటుంబ ఎజెండా తప్ప.. ప్రజల తరఫున ఒక ఎజెండా లేదని ఆరోపించారు. జూబ్లీహిల్స్ మైనర్ బాలికపై అత్యాచారం ఘటన తరువాత రాష్ట్రంలో 8 మందిపై అఘాయిత్యాలు జరిగాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్ నగరాన్ని ఐటీ, ఫార్మా హబ్ గా తీర్చిదిద్దితే.. ఇప్పుడు మాదకద్రవ్యాల మాఫియా హబ్ గా మార్చివేశారంటూ రాష్ట్ర ప్రభుత్వంపై ఫైరయ్యారు.
మహిళా సాధికారత కోసం పోరాడిన పార్టీ కాంగ్రెస్సేనని తెలిపారు గీతారెడ్డి. కానీ.. కేసీఆర్ పాలనలో మహిళా సాధికారత కనుమరుగయ్యిందంటూ విమర్శించారు. రాష్ట్రంలో పబ్ కల్చర్ ను ప్రోత్సహిస్తున్న కేసీఆర్ ప్రభుత్వం వైఖరితో నేరాలు పెరిగిపోయాయని ఆరోపించారు. జూబ్లీహిల్స్ ఘటనలో హోంమంత్రి మనవడు, ఎంఐఎం ఎమ్మెల్యే కుమారుడు, వక్ఫ్ బోర్డు కుమారుడు ఉన్నారు.. అయితే పోలీసులు మాత్రం పొలిటికల్ బాస్ లకు తొత్తులుగా మారారంటూ ఆరోపించారు.
దిశ నిందితులకు ఒక న్యాయం.. వీళ్ళకి ఒక న్యాయమా అంటూ ప్రశ్నించారు. అందుకే మాదకద్రవ్యాల కల్చర్ ను అరికట్టాలన్నా, అరాచక పాలనకు బుద్ధి చెప్పాలన్న కాంగ్రెస్ తోనే సాధ్యమని వెల్లడించారు గీతారెడ్డి.