40 ఏళ్లుగా దేశ రక్షణలో నిమగ్నమై సేవలందించిన సీడీఎస్ బిపిన్ రావత్ కన్నుమూశారు. తమిళనాడులో జరిగిన ఆర్మీ చాపర్ ప్రమాదంలో ఆయన చనిపోయినట్లు భారత వాయుసేన అధికారికంగా ప్రకటించింది. ప్రమాద సమయంలో హెలికాప్టర్ లో మొత్తం 14 మంది ఉండగా… వారిలో 13 మంది మరణించారని తెలిపింది. మృతుల్లో బిపిన్ రావత్, ఆయన భార్య ఉన్నట్లు స్పష్టం చేసింది. ఈ ఘటనలో గాయపడిన పైలట్ గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్.. ప్రస్తుతం వెల్లింగ్టన్ లోని సైనిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపింది.
వైమానిక స్థావరం నుంచి వెల్లింగ్టన్ లోని డిఫెన్స్ సర్వీసెస్ కాలేజీకి వెళ్తుండగా ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలింది. నీలగిరి జిల్లాలోని కొండ ప్రాంతాల్లో శిథిలాలను గుర్తించారు అధికారులు. ప్రమాదం గురించి తెలుసుకున్న ఆర్మీ అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. రావత్ భార్య ఘటనా స్థలంలోనే మృతి చెందగా ఆయన.. చికిత్స పొందుతూ మరణించారు.
హెలికాప్టర్ కూలుతున్న సమయంలో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు చూశారు. వారు చెప్పినదాన్ని బట్టి.. చాపర్ గాల్లో ఉండగానే మంటలు వ్యాపించాయి. తర్వాత దాని శిథిలాలు అక్కడక్కడా పడిపోయాయి. అటవీ ప్రాంతం కావడంతో సహాయక చర్యలకు కాస్త ఇబ్బందులు తలెత్తాయి. అధికారులు, పోలీసులు కష్టపడి అక్కడికి చేరుకుని గాయాల పాలైనవారిని మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు.
ప్రమాదం జరిగిన వెంటనే కేంద్ర కేబినెట్ అత్యవసరంగా సమావేశమైంది. ప్రధాని మోడీ అధ్యక్షతన ఈ మీటింగ్ జరగ్గా.. ఘటనకు సంబంధించిన విషయాలను రక్షణ మంత్రి రాజ్ నాథ్ వివరించారు. అనంతరం రాజ్ నాథ్ సింగ్ సహా ఆర్మీ అధికారులు ఢిల్లీలోని బిపిన్ రావత్ ఇంటికి వెళ్లారు. ఈ ఘటనపై ప్రముఖులు సంతాపం తెలియజేశారు.