హా.హా..హాసినీ అంటూ అమాయకంగా నవ్వే బొమ్మరిల్లు భామ అందాల జెనీలియా మనందరికీ ఇప్పటికీ గుర్తే. ‘ఢీ’, ‘రెడీ’, ‘సై’ వంటి బ్లాక్ బస్టర్స్‌తో తెలుగులో కొన్నేండ్ల పాటు స్టార్ హీరోయిన్‌గా వెలిగింది జెనీలియా.
రానా సరసన నటించిన ‘నా ఇష్టం’ సినిమా తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలో ఆమె మరో సినిమా చేయలేదు. రితేష్‌తో పెళ్లి తర్వాత పూర్తిగా వ్యక్తిగత జీవితానికే సమయం కేటాయించింది. భర్త రితేష్‌తో కలిసి ఆమె ఇటీవల ‘వేద్’ అనే చిత్రంలో నటించింది. తెలుగులో నాగ చైతన్య, సమంత కలిసి నటించిన ‘మజిలీ’ చిత్రానికిది మరాఠీ రీమేక్.
వేద్ ఘన విజయం సాధించి జెనీలియా నటనకు మంచి పేరు తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో జెనీలియా మాట్లాడుతూ…‘జీవితంలో ఒకటి కావాలంటే మరొకటి వదిలేయాల్సిందే. రెండు పడవల మీద ప్రయాణం సాగదు. పెళ్లయ్యాక వ్యక్తిగత జీవితానికి సమయం కేటాయించా. సినిమాలు చేస్తూ ఇంటిని చూసుకోవడం కుదరలేదు.
అందుకే సినిమాలు వదిలేశా. అలా చేయడం వల్లే ఈరోజు ఒక మంచి ఇల్లాలిగా కుటుంబంలో పేరు తెచ్చుకున్నా. ప్రొడ్యూసర్‌గా సొంత ప్రొడక్షన్ చేస్తున్నా. మరికొన్ని వ్యాపార సంస్థలూ స్థాపించగలిగా. ఇన్నేండ్ల తర్వాత ప్రేక్షకులు నన్ను మళ్లీ నటిగా ఆదరించడం సంతోషంగా ఉంది. నేను ఇష్టపడే కథలు దొరికితే ఎప్పుడైనా ఒక సినిమాలో నటిస్తా’ అని చెప్పింది.