జమ్మూ కశ్మీర్ లోని పరిస్థితిపై జర్మనీకి బాధ్యత ఉందని, ఈ సమస్య పరిష్కారంలో తమవంతు పాత్ర కూడా ఉందని ఆ దేశ విదేశాంగ మంత్రి అనలేనా బేర్ బక్ చేసిన వ్యాఖ్యలపై ఇండియా మండిపడింది. కశ్మీర్ విషయంలో ఐక్యరాజ్యసమితి సైతం జోక్యం చేసుకోవచ్చునన్న ఆమె కామెంట్ల పట్ల కొంత మేర అసహనం వ్యక్తం చేసింది. ఈ సమస్యపై పాకిస్తాన్ తో మాట్లాడాలని, ఐరాస ‘ట్రాక్’ (నియమావళి)ని ఫాలో కావాలని ఆమె ఇచ్చిన అయాచిత సలహా పట్ల విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాఘ్చి అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఈ నెల 7 న పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టోతో కలిసి అనలేనా మీడియాతో మాట్లాడారు. కశ్మీర్ వివాద పరిష్కారంలో ఐరాస పాత్రను తమ దేశం సమర్థిస్తోందని, అసలీ సమస్యపై భారత-పాకిస్థాన్ దేశాల మధ్య పొలిటికల్ డైలాగ్ ఎంతైనా అవసరమని ఆమె చెప్పారు. ఈ సమస్యకు శాంతియుత పరిష్కారం లభించాలని తాము కోరుతున్నామన్నారు. అయితే ఇలాంటి వ్యాఖ్యలవల్ల ఉగ్రవాద బాధితులకు అన్యాయం చేసినట్టే అవుతుందని అరిందమ్ బాఘ్చి పేర్కొన్నారు.
దేశాల్లో ఏ సభ్య దేశానికైనా దాని బాధ్యత అంటూ ఉంటుందని, అంతర్జాతీయ సీమాంతర ఉగ్రవాదంపై అది దృష్టి నిలపవలసి ఉంటుందని ఆయన అన్నారు. దశాబ్దాల తరబడి కశ్మీర్ ఉగ్రవాద పోకడలతో సతమతమవుతోందని, ఇప్పటికీ ఆ కేంద్రపాలిత ప్రాంతంలో అది కొనసాగుతోందని ఆయన చెప్పారు.
ఈ సందర్భంగా ఆయన పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఒకనాడు ముంబైలో జరిపిన పేలుడు ఘటనను ప్రస్తావించారు. మరి ఇలాంటి ఉగ్రవాద చర్యల ఫలితంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు, బాధితులకు మీలాంటివారి వ్యాఖ్యలు బాధ కలిగించవా అని ఆయన ప్రశ్నించారు. స్వార్థ ప్రయోజనాల వల్ల కొన్ని దేశాలు ఈ ముప్పు నేపథ్యంలో కలిగే ప్రమాదాలను గుర్తించవని, శాంతి యత్నాలను అవి చిన్న చూపు చూస్తాయని అరిందమ్ బాఘ్చి ఆరోపించారు. అయితే కశ్మీర్ విషయంలో ఐరాస పాత్ర ఉందన్న ఆమె వ్యాఖ్యలను ఆయన సమర్థించారు. ఇదే సమయంలో ఉక్రెయిన్ అంశంలో ఐరాస పాత్ర ఏమిటని ఈ సందర్భంగా ప్రశ్నించారు.