వీకెండ్ వచ్చిందంటే చాలు ఫుల్ గా మద్యం సేవించి చిల్ కోసం వాహనాలు స్పీడ్ గా నడపడం నగరంలో యువతకు కిక్ లా మారిపోయింది. ప్రాణాల పైకి వస్తుందని తెలిసినా ఆ కిక్ ముందు ప్రాణాలను సైతం లెక్కచేయడం లేదు. పోలీసులు ఎంత పటిష్టంగా డ్రంకన్ డ్రైవ్ ను చేపట్టినా.. యువతలో మాత్రం మార్పు రావడం లేదు. ఇక అన్ని విషయాల్లో అబ్బాయిలతో పోటీ పడుతున్న అమ్మాయిలు ఈ విషయంలో కూడా పోటీ పడడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
మద్యం మత్తులో అబ్బాయిలతో కలిసి అమ్మాయిలు జూబ్లిహిల్స్ చెక్ పోస్టు దగ్గర కారుతో బీభత్సాన్ని సృష్టించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. కారులో వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఏం చేస్తున్నారో వారికే అర్థం కాలేదు. కారును అతివేగంగా నడిపారు. కానీ కారు నడుపుతున్న యువతి మద్యం సేవించి మైకంలో నడుపుతుందన్న విషయాన్ని మిగతా వాళ్లు పట్టించుకోలేదు. వాళ్లు కూడా స్పీడ్ ను ఎంజాయ్ చేస్తున్నారు. కాని ఇంతలోనే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది.
ఒక్కసారిగా పెద్దగా శబ్దం రావడంతో అందరూ ఉలిక్కి పడి.. మైకంలో నుంచి బయటికొచ్చారు. చూస్తే.. కార్ డ్రైవ్ చేస్తున్న యువతి కారును తీసుకెళ్లి డివైడర్ ను ఢీ కొట్టేసింది. ఇక అసలేం జరుగుతుంది అనుకునే లోపే.. అరుపులతో కాసేపు ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. కారు ప్రమాదానికి గురైంది. మద్యం మత్తులో ఉన్న యువతి కారును అతివేగంగా ఎదురుగా వున్న డివైడర్ ను గుద్దడంతో భయంతో జనం పరుగులు తీశారు. కారులో ఉన్న వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఎక్కడ పోలీసులకు చిక్కుతామో అనుకున్న వాళ్లు కారు దిగి ఎవరికి వారు పరుగులు తీశారు.
కారును అక్కడే వదిలేశారు. దీంతో స్పాట్ కు చేరుకున్న పోలీసులు క్రేన్ సహాయంతో కారును రోడ్డు పై నుంచి తొలగించారు. అయితే కారులో ఉన్నదెవరు..ఎంత మంది ఉన్నారు. కారు నడిపిందెవరు.. ఈ విషయాలను కూపీ లాగే పనిలో పడ్డారు పోలీసులు. ఇకనైనా మద్యం మత్తులో వాహనాలు నడపవద్దని అలర్ట్ గా ఉండాలని సూచిస్తున్నారు.