మరో వారం రోజుల్లో విడుదలకాబోతంది గని సినిమా. ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ విషయంలో ఎలాంటి ఇబ్బంది తలెత్తలేదు. ఎఁదుకంటే, అక్కడ వరుణ్ తేజ్ ఉన్నాడు కాబట్టి. అతడికి థియేట్రికల్ మార్కెట్ ఫిక్స్ అయి ఉంది. ఎటొచ్చి నాన్-థియేట్రికల్ విషయంలో మాత్రం వరుణ్ ఇంకా మెరుగుపడాల్సి ఉంది. అతడికి ఓ ఫిక్స్ డే రేటు లేదు. కాంబినేషన్ల బట్టి వరుణ్ సినిమాల శాటిలైట్, థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోతున్నాయి. ఇప్పుడు గని వంతు వచ్చింది.
గని సినిమా నాన్-థియేట్రికల్ రైట్స్ లాక్ చేయడానికి నిర్మాతలు చాలా కష్టపడ్డారు. బడ్జెట్ ఎక్కువ అవ్వడంతో, నాన్-థియేట్రికల్ కూడా ఎక్కువ చెప్పారు. కానీ కేవలం వరుణ్ తేజ్ ఇమేజ్ మీద వస్తున్న ఈ సినిమాను కొనేందుకు ఇంట్రెస్ట్ చూపించలేదు. అలా లాస్ట్ మినిట్ వరకు శాటిలైట్, డిజిటల్ ను మేకర్స్ అమ్మలేకపోయారు. ఇక మెయిన్ ప్లేయర్స్ ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో.. తండ్రి అల్లు అరవింద్ సహకారంతో, నిర్మాత అల్లు బాబి, ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను ఆహాకు అమ్మేశారు.
ఆహా ఓటీటీ సంస్థ, గని డిజిటల్ రైట్స్ ను దక్కించుకుంది. అటు ఇటుగా 14 కోట్ల రూపాయలకు ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్ అమ్ముడుపోయినట్టు తెలుస్తోంది. అటు శాటిలైట్ రైట్స్ ను జెమినీ ఛానెల్ దక్కించుకుంది. ఈ రైట్స్ 6 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయినట్టు సమాచారం. అలా కీలకమైన శాటిలైట్, డిజిటల్ రైట్స్ ను 20 కోట్ల రూపాయలకు అమ్మేశారు మేకర్స్.
ఈ నెల 8న గని సినిమా థియేటర్లలోకి రాబోతోంది. ఈ సినిమాతో కిరణ్ కొర్రపాటి దర్శకుడిగా పరిచయమౌతున్నాడు. సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా పరిచయమౌతోంది. తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.