వరుణ్ తేజ్ హీరోగా నటించిన సినిమా గని. ఈ సినిమా థియేటర్లలోకి వచ్చి 2 వారాలు కూడా పూర్తవ్వలేదు. అంతలోనే ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది. వచ్చే వారానికి ఇది ఓటీటీలో స్ట్రీమింగ్ కు రాబోతోంది. ఆహా యాప్ లో గని మూవీ, ఈనెల 22న, అంటే వచ్చే శుక్రవారమే స్ట్రీమింగ్ కు రాబోతోంది. అలా గని సినిమా థియేట్రికల్ రన్ ముగియనుంది.
ఓ సినిమా ఓటీటీలోకి రావాలంటే 7 వారాల లాక్-ఇన్ పీరియడ్ నిబంధన ఉంది. థియేటర్లలో రిలీజైన 7 వారాల వరకు ఓటీటీలోకి రాకూడదనేది ఆ నిబంధన. మొన్నటివరకు పెద్ద సినిమాలు ఈ రూల్ పాటించేవి. కానీ ఇప్పుడవి కూడా తప్పుకున్నాయి. మొన్నటికిమొన్న రాధేశ్యామ్ సినిమా ఇలానే ఊహించని విధంగా చాలా తొందరగా ఓటీటీలోకి వచ్చేసింది. ఈమధ్య శ్యామ్ సింగరాయ్ సినిమా కూడా ఇలానే గడువు కంటే ముందే వచ్చేసింది. ఇప్పుడు గని సినిమా కూడా వచ్చేస్తోంది.
థియేటర్లలో తమ సినిమా ఆడదని నిర్ణయానికొచ్చిన తర్వాత మేకర్స్ అంతా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. రాధేశ్యామ్, గని సినిమాల విషయంలో జరిగిందిదే. ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలు మాత్రం 7 వారాల తర్వాతే వస్తున్నాయి.
వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఈ సినిమాతో అల్లు అరవింద్ పెద్ద కొడుకు అల్లు బాబి తొలిసారిగా నిర్మాతగా మారాడు. తొలి సినిమాతోనే ఫ్లాప్ అందుకున్నప్పటికీ, ప్రొడక్షన్ వాల్యూస్ విషయంలో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు.