కరోనా వైరస్ వ్యాప్తి శరవేగంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు కేవలం విదేశాల నుండి వచ్చిన వాళ్లతో పాటు వారి కుటుంబీకులకు మాత్రమే పాజిటివ్ వచ్చింది. కానీ క్రమంగా కరోనా వైరస్ ఇతరులకు కూడా సోకుతుందని తెలుస్తోంది.
అయితే, హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదు కావటంతో పాటు ఆయా ప్రాంతాల్లోనే విదేశాల నుండి వచ్చిన వారు తిరిగినట్లుగా అధికారులు భావించి, రెడ్ జోన్ గా పలు ప్రాంతాలను ప్రకటించారు. జీహెచ్ఎంసీని మొత్తం 5 జోన్లుగా ప్రకటించారు.
హైదరాబాద్ లో చందానగర్, కోకాపేట్, కొత్తపేట్, గచ్చిబౌలి, తుర్కయాంజల్ ప్రాంతాలను రెడ్ జోన్ గా ప్రకటించారు. ఈ ఏరియాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలు ఇళ్లలో నుండి బయటకు అనుమతించేది లేదని అధికారులు స్పష్టం చేశారు. రేషన్ సహా ఎలాంటి అవసరం ఉన్నా అధికారులు ప్రజల ఇళ్ల వద్దకే వచ్చి అందిస్తారని, 14రోజుల పాటు ఇంటి నుండి బయటకు వచ్చే ఆలోచననే విరమించుకోవాలని అధికారులు స్పష్టం చేశారు.
మెడిసిన్ సహా ఎలాంటి అవసరం ఉన్నా… ప్రజలు డయల్ 100కు కాల్ చేయాలని ప్రభుత్వం, పోలీసులు సూచిస్తున్నారు.