మేయర్ విజయలక్ష్మిపై బీజేపీ కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబర్ పేట కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు ప్రదీప్ మరణించిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై బీజేపీ కార్పొరేటర్లు మేయర్ విజయలక్ష్మిపై ఫైర్ అయ్యారు.
ఆమె ప్రెస్ మీట్ కే పరిమితమని సెటైర్లు వేశారు. కుక్కలకు సరిగ్గా ఫీడ్ చేయాలని ఉచిత సలహా ఇస్తారా? డాగ్ అడాప్షన్ చేసుకోవాలని సూచిస్తారా? అని మండిపడ్డారు. అంతేకాకుండా ఆల్రెడీ ప్రతీ ఇంట్లో కుక్కలు ఉన్నాయని, ఇంకెవరు దత్తత చేసుకుంటారు? కుక్కల నియంత్రణకు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? అని వారు ప్రశ్నించారు.
చివరికి కుక్క కాటుకి వైద్యం అందించే దిక్కు లేదని ఎద్దేవా చేశారు. బాలుడి మృతి బాధకరమని, ప్రభుత్వం ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదని దుయ్యబట్టారు. జీహెచ్ఎంసీలో పాలన అస్తవ్యస్తంగా మారిందన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఏం జరుగుతోందని, ఎలాంటి చర్యలు చేపట్టాలి అనే దానిపై రివ్యూ పెట్టాలన్నారు.
జీహెచ్ఎంసీలో అందరూ కమీషన్లకు అలవాటు పడిపోయారని ఆరోపించారు. రీ ప్రొడక్టివిటీకి వచ్చే డబ్బులు కూడా అధికారులు దోచుకున్నారని, జీహెచ్ఎంసీని కేటీఆర్, కవిత, సంతోష్ రావు చేతుల్లో పెట్టారన్నారు. ప్రగతి భవన్ లేదా దారుస్సలాం నుంచి ఆర్డర్ వస్తే కానీ నగరంలో ఏ పని జరగదని ఎద్దేవా చేశారు బీజేపీ కార్పొరేటర్లు.