హైదరాబాద్ నగరంలో కుక్కకాటు బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. కుక్కకాటు చికిత్స కోసం వందలాది మంది బాధితులు హైదరాబాద్ నారాయణ గూడ ప్రివెంటివ్ సెంటర్ కు చేరుకుంటున్నారు. సాధారణంగా రోజుకు 500 మంది నారాయణ గూడ ప్రివెంటివ్ సెంటర్ కు చికిత్స కోసం వస్తూంటారు. కానీ ఇటీవల కాలంలో ఈ సంఖ్య పెరుగుతూపోతుంది.
జీహెచ్ఎంసీ పరిధిలోనే కాకుండా హైదరాబాద్ సమీపంలోని ఇతర ప్రాంతాల నుంచి కూడా వైద్యం కోసం ఈ కేంద్రానికి వస్తూంటారు. అయితే ఇటీవల కాలంలో ఈ సంఖ్య భారీగా పెరుగుతుందని వైద్య సిబ్బంది చెబుతున్నారు. రెండు రోజుల క్రితం అంబర్ పేటలో ప్రదీప్ అనే నాలుగేళ్ల బాలుడు కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడి మరణించాడు.
ఇక ఈ వీధి కుక్కల దాడిలో పలువురు దాడికి గురవుతూనే ఉంటున్నారు. దీంతో జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి మంగళవారం అధికారులతో అత్యవసరంగా సమావేశం ఏర్పాటు చేశారు. వీధి కుక్కలను పట్టుకోవాలని ఆదేశించారు.
మేయర్ ఆదేశాలతో జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని జోన్లలో ఇప్పటివరకు 500 వీధి కుక్కలను జీహెచ్ఎంసీ అధికారులు పట్టుకున్నారు. కాగా నగరంలో కోతులు, వీధి కుక్కల బెడదను అరికట్టేందుకు ఈ నెల 23న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు ప్రకటించారు.