గతంలో ఎన్నడూ లేని విధంగా కాక రేపుతున్న గ్రేటర్ ఎన్నికల ప్రచారం పర్వం తుది దశకు చేరుకుంది. రేపు సాయంత్రం 5 గంటలతో ముగియనుంది. దీంతో ఈ రెండు రోజులు ప్రచారం మరింత హోరెత్తనుంది. కాగా రేపు సాయంత్రం 5 గంటల తర్వాత ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన అభ్యర్థులు నగరం నుంచి వెళ్లాల్సి ఉంటుంది.
గతంలో పోలిస్తే ఈ సారి జీహెచ్ఎంసీ ఎన్నికలు ప్రత్యేకతను సంతరించుకున్నాయి. నోటిఫికేషన్, పోలింగ్ మధ్య 15 రోజుల సమయం మాత్రమే ఇచ్చారు. దీంతో అన్ని పార్టీలు రాష్ట్ర క్యాడర్ మొత్తాన్ని నగరంలోకి దింపేశాయి. అలాగే మునుపెన్నడూ లేని విధంగా పార్టీల మధ్య మాటల, తూటాలు పేలుతున్నాయి. ఎంఐఎం, టీఆర్ఎస్ వంటి పార్టీలు పట్టు నిలుపుకోవాలని ప్రయత్నం చేస్తోంటే.. కాంగ్రెస్, టీడీపీ వంటి పార్టీలు పూర్వ వైభవం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక బీజేపీ బల్దియా పీఠం కోసం సర్వ శక్తులు ఒడ్డుతోంది.