ఎప్పుడూ సెంటిమెంట్ ను నమ్ముకునే టీఆర్ఎస్ ఈసారి అభివృద్దిని నమ్ముకుంది. ప్రతిసారి అభివృద్ధిని నమ్ముకునే జాతీయ పార్టీలు సెంటిమెంట్ ను నమ్ముకున్నాయి.
అవును… గత ఐదేళ్ల జీహెచ్ఎంసీ అభివృద్ధిని, ఆరేళన్నర సంవత్సరాల తెలంగాణ ప్రభుత్వం చేసిన పనులను చూసి టీఆర్ఎస్ ను గెలిపించాలని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రజలను కోరారు. ఏ పార్టీ అభివృద్ధి చేయలేదని, బీజేపీ- కాంగ్రెస్ లు ప్రభుత్వ సంస్థలను అమ్ముతుంటే తాము మాత్రం పేదల కోసం పనిచేస్తున్నామని ఓట్లడిగారు.
ఇటు బీజేపీ పూర్తిగా సెంటిమెంట్ నే నమ్ముకుంది. జాతీయ వాదానికి ఓటేయాలని… ఎంఐఎంతో రహస్య సంబంధాలు నడిపే టీఆర్ఎస్ ను నమ్మకండని కోరారు. ముఖ్యంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ అరవింద్, మంత్రి కిషన్ రెడ్డిలు అంతా తామే అయి వ్యవహరించారు. ముఖ్యంగా బండి సంజయ్ టీఆర్ఎస్ కు కొరకరాని కొయ్యగా మారినట్లు బీజేపీపై టీఆర్ఎస్ నేతల విమర్శలే ఉదాహారణ అన్న అభిప్రాయం వ్యక్తం అయ్యింది.
ఇక కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి పూర్తిగా తన భుజాలపై ఒంటరిగా మోసినట్లు కనపడింది. ప్రతి డివిజన్ తిరుగుతూ… బీజేపీ, టీఆర్ఎస్, ఎంఐఎం నేతల తెర వెనుక ఉన్న సంబంధాలను ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగారు. నగరం అభివృద్ధి చేసిందెవరో, చేసేదెవరో తనదైన శైలీలో వివరించారు. ఓవైపు పెద్ద నాయకులు సైలెంట్ అయినా, మరోవైపు నేతలంతా ఒక్కొక్కరు ఇతర పార్టీల వైపు చూస్తున్నా… అధైర్య పడకుండా కాంగ్రెస్ జెండా ఎగురవేసేందుకు కృషి చేస్తామని ఓట్లడిగారు.