గ్రేటర్ ఎన్నికల ఓట్ల లెక్కింపు మొదలైంది. మొత్తం 150 డివిజన్లకు సంబంధించి 30 చోట్ల కౌంటింగ్‌కు ఏర్పాట్లు చేశారు. తక్కువ ఓట్లు పోలైన కొన్ని డివిజన్ల ఫలితం ఒక్క రౌండ్‌లోనే వెల్లడవుతుంది. పెద్ద డివిజన్లకు సంబంధించి ఫలితాలు వచ్చేందుకు మూడు రౌండ్లు పట్టవచ్చు. దాదాపుగా ఉదయం 11 గంటలకు మొదటి రౌండు లెక్కింపు పూర్తయ్యే అవకాశముంది. మధ్యాహ్నం 12 గంటల్లోగా తొలి ఫలితం రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తం ఫలితాలు సాయంత్రం 3 గంటల్లోగా తేలే అవకాశం ఉందని చెప్తున్నారు.
ప్రతి డివిజన్ ఓట్ల లెక్కింపు కేంద్రంలో 14 టేబుళ్లను ఏర్పాటు చేశారు. దీంతో ప్రతి రౌండ్‌లో 14 వేల ఓట్లు లెక్కించే అవకాశం ఉంది. మెహిదీపట్నం డివిజన్‌లో 11వేల పైచిలుకు ఓట్లు మాత్రమే పోల్ కాగా.. 100 డివిజన్లలో 20 వేలు ఆపైన మాత్రమే పోలింగ్ జరిగింది. దీంతో పోటీ హోరాహోరీగా ఉండటంతో పాటు, మెజార్టీలు బాగా తగ్గే అవకాశం ఉంది. అలాగే స్వల్ప ఓట్ల తేడాతోనే అభ్యర్థులు గెలిచే అవకాశముంది. దీంతో అభ్యర్థులు తమ ఏజెంట్లకు జాగ్రత్తలు మీద జాగ్రత్తలు చెప్పి కౌంటింగ్ కేంద్రాలకు పంపించారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం ప్రధాన పార్టీలు గతంలో కంటే హోరాహోరీగా ప్రచారం చేశాయి. ఆరోపణలు ప్రత్యారోపణలతో వేడి పెంచారు. కానీ పోలింగ్ శాతం పెరగలేదు.