గ్రేటర్ ఎన్నికల పోరు గతంలో కంటే రసవత్తరంగానే సాగుతోంది. అయితే అన్ని ప్రధాన పార్టీలు రంగంలో ఉన్నా.. రాజకీయం మాత్రం కేవలం మూడు పార్టీల చుట్టే తిరగడం చర్చనీయాంశంగా మారింది. నగర అభివృద్ధి, భవిష్యత్తు కంటే ప్రచార పర్వం ఎక్కువగా మతమనే అంశం చుట్టూ తిరుగుతోంది. బీజేపీ ఒక్క అగ్గిపుల్ల వేసిందో లేదో… టీఆర్ఎస్, ఎంఐఎం ఆ మంటను మరింత రాజేస్తున్నాయి. అలా ఎంఐఎం, టీఆర్ఎస్‌ను టార్గెట్ చేస్తూ బీజేపీ కొత్త ఓట్ల వేటలో పడితే.. బీజేపీని టార్గెట్ చేస్తూ టీఆర్ఎస్, ఎంఐఎం పాత సీట్లను కాపాడుకునే పనిలో పడ్డాయి. ఆశ్చర్యంగా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ఈ మూడు పార్టీల ప్రచారమే తప్ప…ఇతర పార్టీలకు తమ వాయిస్‌ను వినిపించే ఛాయిస్, స్పేస్ లేకుండా పోతోంది.
టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎంతో పాటు కాంగ్రెస్, టీడీపీ కూడా గ్రేటర్ బరిలో ఉన్నాయి. అధికార పార్టీ అవినీతిని బయటపెడుతూ.. నగర అభివృద్దికి తామేం చేస్తామో, చేయగలమో గట్టిగానే చెప్పుకుంటున్నాయి. అయితే వారి మాట మైకుల వరకు పరిమితం కావడమే తప్ప.. స్క్రీనులపైకి ఎక్కడం లేదు. ఎంత సేపు కాంట్రవర్సీలకే ప్రాధాన్యం దక్కుతుండటంతో.. ఆ పార్టీల స్లోగన్స్ కామెన్ మెన్‌కి చేరడం లేదు. దీంతో సోషల్ మీడియానే వారి ప్రచారానికి ఇప్పుడు పెద్ద దిక్కుగా మారింది.
మరోవైపు ఇంత తీవ్రమైన పోటీ ఉన్నా… ఆయా పార్టీలు కుల, మత, ప్రాంత రాజకీయాల ప్రస్తావన తీసుకురాకపోవడం మెచ్చుకోదగిన విషయమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.