గ్రేటర్ ఓట్ల లెక్కింపునకు ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 8 గంటలకు 150 డివిజన్లకు సంబంధించి ఓట్ల లెక్కింపు మొదలుకానుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్లు, ఆపై బ్యాలెట్ పేపర్లను లెక్కించనున్నట్టు ఈసీ తెలిపింది. కాగా ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 30 కేంద్రాల్లో 166 కౌంటింగ్ టేబుళ్లను ఏర్పాటు చేసింది.
ఒక్కో డివిజన్‌కు 14 టేబుళ్లతో కౌటింగ్ హాల్‌ను సిద్ధం చేసింది. ఇక కౌంటింగ్ హాల్ చిన్నగా ఉన్న 16 డివిజన్లకు మాత్రం రెండు హాళ్లను కేటాయించింది. ఒక్కో కౌంటింగ్ హాల్‌లో రిటర్నింగ్ అధికారి, సహాయ రిటర్నింగ్ అధికారిని కేటాయించింది. అలాగే ప్రతి కౌంటింగ్ కేంద్రానికి ఒక్కో పరిశీలకుడిని నియమించింది.
అభ్యర్థుల విషయానికి వస్తే ఒక్కో టేబుల్‌కు ఒక ఏజెంట్‌ను నియమించుకునే అవకాశం ఉంది. అయితే వారు ఒక్కసారిగా లోపలికి వెళ్తే కౌంటింగ్ పూర్తయ్యే వరకు అక్కడే ఉండాలని… ఏజెంట్లకు రిలీవింగ్ సౌకర్యం లేదని స్పష్టం చేసింది. కౌంటింగ్ హాళ్లలోకి మొబైల్‌ఫోన్లు తీసుకెళ్లేందుకు అనుమతి లేదు. మరోవైపు అన్ని కౌంటింగ్ హాళ్లలో కౌంటింగ్ ప్రక్రియను రికార్డ్ చేయనుంది.
ఎన్నికల పరిశీలకుడి అనుమతి తర్వాత ఫలితాలు ప్రకటిస్తారు. అనుమానిత ఓట్లకు సంబంధించి రిటర్నింగ్ అధికారిదే తుది నిర్ణయం. ఫలితాలు ప్రకటించడానికి ముందే రీకౌంటింగ్ కోసం రిటర్నింగ్ అధికారికి విజ్ఞప్తి చేయాలని సూచించింది. అభ్యర్థులకు సమానంగా ఓట్లు వస్తే లాటరీ పద్ధతిలో డ్రా తీస్తారు.