గ్రేటర్ ఎన్నికలు సమీపించే కొద్ది అధికార పార్టీలో టెన్షన్ పెరిగిపోతోంది. ఎక్స్ ఆఫిషియో ఓట్లతో గ్రేటర్ పీఠాన్ని దక్కించుకోవచ్చన్న ధీమా ఉన్నా.. గతంలో కంటే సీట్లు తగ్గితే అపోజిషన్‌కు చులకనవుతామనే భయం వెంటాడుతోంది. దీంతో గంపగుత్తగా ఓట్లుపడే అవకాశమున్న వివిధ సంఘాలకు చెందిన నాయకులను పిలిపించుకొని మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు అధికార పార్టీ నేతలు. ఇందులో భాగంగా ఉద్యోగ సంఘాల నేతలపై వారి దృష్టి పడింది.
గ్రేటర్ ఎన్నికల్లో ఉద్యోగుల ఓట్లను అధికార పార్టీకే పడేలా చేయాలని వారిని నేతలు కోరుతున్నారట. అయితే ఉద్యోగ సంఘాల నేతలు అధికార పార్టీకి అనుకూలంగానే ఉన్నా.. ఉద్యోగులు మాత్రం ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. పైగా తమ సమస్యలను చెప్పాల్సిన ఉద్యోగ సంఘాల నాయకులు తమ స్వంత పనులు చేయించుకోవడమే తప్ప.. ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం లేదని వారు బాహటంగానే విమర్శిస్తున్నారు. దీంతో ఈసారి సర్కార్‌కు ఉద్యోగుల దెబ్బ తప్పదనే అంచనాలు వినిపిస్తున్నాయి.
గ్రేటర్ పరిధిలో ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, వారి కుటుంబాలు కలిసి 7 నుంచి 8 లక్షలు ఓట్లు ఉంటాయని ఓ అంచనా ఉంది. ప్రస్తుతం ఉద్యోగులకు సంబంధించి ఎవరిలోనూ ప్రభుత్వంపై సానుకూల అభిప్రాయం లేదు. పీఆర్సీపై కాలయాపన, కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ హామీ వంటివన్నీ ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. దీంతో ఈ ఎన్నికల్లో ఓటు ద్వారా ప్రభుత్వానికి తమ నిరసన తెలిపేందుకు సిద్ధమవుతున్నారన్న చర్చ నడుస్తోంది.