తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా టీఆర్ఎస్ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు జరిపుకున్నారు. పార్టీ శ్రేణులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భారీగా కేసీఆర్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే.. అనుమతి లేని చోట ఫ్లెక్సీల ఏర్పాటు చేయడంతో టీఆర్ఎస్ శ్రేణులకు జీహెచ్ఎంసీలోని ఈవీడీఎం అధికారులు షాక్ ఇచ్చారు.
అయితే.. నగరానికి చెందిన అలిశెట్టి అరవింద్ కుమార్ అనూహ్యంగా హుస్సేన్ సాగర్ లోపల స్టీమర్ కు 40 ఫీట్ల భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేసి తన అభిమానాన్ని చాటుకున్నారు. ఈ క్రమంలో దీనిపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈవీడీఎంకు ఫిర్యాదు చేశారు. దీంతో అతనికి రూ.5వేల ఫైన్ వేశారు అధికారులు.
ఈ నేపథ్యంలోనే కాలనీలు, రహదారుల పొడవునా ఏర్పాటు చేసిన బోర్డులకు జీహెచ్‌ఎంసీ ఎన్‌ఫోర్స్ మెంట్ విభాగం అధికారులు రూ.60వేల వరకు జరిమానాలు విధించారు. అయితే.. కొన్ని ఫ్లెక్సీలపై పేర్లు లేవన్న కారణంతో జరిమానా విధించలేదు. దీంతో అధికారుల తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు.
పేర్లు లేకుండా ఫోటోలు మాత్రమే ఉంటే జరిమానాలు విధించరా? ఇదెక్కడి పక్షపాతం అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఫ్లెక్సీలు పెట్టడం.. తూతూమంత్రంగా ఫైన్లు వేయడం, ఇదంతా మ్యాచ్ ఫిక్సింగ్ అని జనం భావిస్తున్నారు.
అయితే.. గురువారం సీఎం కేసీఆర్ పట్టినరోజు సందర్భంగా మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ మూడురోజుల పాటు సాగిన వేడుకల్లో అన్నదానాలు, రక్తదానాలు నిర్వహించడంతో పాటు.. కేసీఆర్ పేరిట ఆలయాల్లో పూజలు, అర్చనలు చేయించారు పార్టీ శ్రేణులు.