బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్ లోనే అని అనౌన్స్ మెంట్ వచ్చినప్పటి నుంచి నగరంలో టీఆర్ఎస్, బీజేపీ మధ్య ఫ్లెక్సీ వార్ మొదలైంది. ప్రధాన కూడళ్లు, మెట్రో స్తంభాలకు ఫ్లెక్సీలు, పెద్ద పెద్ద హోర్డింగులను రెండు పార్టీలు బుక్ చేసుకున్నాయి. కానీ.. చాలా వరకూ ముందస్తుగానే టీఆర్ఎస్ బుక్ చేసేసుకుంది. అవన్నీ కమర్షియల్ యాడ్స్ కాబట్టి ఓకే.. కానీ.. జీహెచ్ఎంసీ నిబంధనలకు విరుద్ధంగా కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాయి రెండు పార్టీలు.
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల గురించి ఆ పార్టీ పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు కట్టింది. ఇటు విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా రాక సందర్భంగా భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది టీఆర్ఎస్. అనుమతి లేని ప్రదేశాల్లో పెద్దఎత్తున పోటాపోటీగా హోర్డింగులు పెట్టాయి. నగరవ్యాప్తంగా చాలా చోట్ల అనుమతులు లేని చోట్ల ఫ్లెక్సీలు, హోర్డింగులు, కటౌట్లు కనిపించాయి.
అయితే.. ఎట్టకేలకు జీహెచ్‌ఎంసీ అధికారులు బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలకు జరిమానాలు విధించింది. కానీ.. లెక్కలో చాలా తేడా కనిపించింది. బీజేపీ ఏ స్థాయిలో ఫ్లెక్సీలు కట్టిందో పోటీకి టీఆర్ఎస్ కూడా అదే చేసిందనే విమర్శలు ఉన్నాయి. కానీ.. జీహెచ్ఎంసీ మాత్రం బీజేపీ నేతలకు రూ.20 లక్షలు, టీఆర్ఎస్ నాయకులకు రూ.3 లక్షల మేర ఫైన్ విధించింది.
ఈ లెక్క ఆదివారం తర్వాత ఇంకా పెరుగుతుందని వార్తలు వస్తున్నాయి. టీఆర్ఎస్ నిబంధనలు పాటించకపోయినా.. ఫైన్ల విషయంలో చూసీ చూడనట్లు ఉన్నారనే విమర్శలు బీజేపీ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి.