హైదరాబాద్ రాజ్ భవన్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితపై చేసిన వ్యాఖ్యలను నిరసనగా గవర్నర్ ను కలిసేందుకు వెళ్లారు బీఆర్ఎస్ నేతలు. జీహెచ్ఎంసీ మేయర్, బీఆర్‌ఎస్ మహిళా కార్పొరేటర్లు మూకుమ్మడిగా అక్కడికి చేరుకున్నారు.
రాజ్ భవన్ లోకి వెళ్లేందుకు బీఆర్‌ఎస్ మహిళా నేతలు ప్రయత్నించారు. అయితే.. అందర్నీ పోలీసులు అడ్డుకున్నారు. గవర్నర్ అపాయింట్ మెంట్ లేదని అపారు ఖాకీలు. దీంతో రాజ్ భవన్ ఎదుట బైఠాయించారు మేయర్, కార్పొరేటర్లు.
బండి సంజయ్ కు వ్యతిరేకంగా మహిళా నేతలు నినాదాలు చేశారు. ఉదయం నుంచి గవర్నర్ సమయం ఇవ్వట్లేదన్న వారంతా.. ఆమెను కలిసి ఫిర్యాదు చేసేంతవరకు వెళ్లేది లేదంటూ అక్కడే నిరసన తెలిపారు. అయితే.. రాజ్ భవన్ ముందు బారికేడ్లు ఏర్పాటు చేశారు పోలీసులు.
అయితే.. లిక్కర్ స్కాం ప్రకంపనల నేపథ్యంలో కవితను టార్గెట్ చేస్తూ మాట్లాడారు బండి సంజయ్. కవిత జైలుకు వెళ్తారని.. కేసీఆర్ కుటుంబం నుంచి ఒక వికెట్ పడుతుందని అన్నారు. తప్పు చేసిన వారికి శిక్ష పడాల్సిందే అంటూ పేర్కొన్నారు. ఈక్రమంలో తప్పు చేసిన కవితను అరెస్ట్ చెయ్యకుండా ముద్దు పెట్టుకుంటారా అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నారు. ఈ నేపథ్యంలోనే గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేయాలని అప్పటికప్పుడు బీఆర్ఎస్ శ్రేణులు రాజ్ భవన్ కు వెళ్లారు.