ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు ఉంది జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి తీరు. హైదరాబాద్‌లో సమస్యలు ఎలా ఉన్నా.. అవార్డుల్లో మాత్రం పేరు ఉండాల్సిందే అన్నట్టుగా ఆమె మాట్లాడుతున్నారు. తాజాగా దేశంలో సులభతర జీవనంలో హైదరాబాద్‌కు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ 24వ స్థానం ప్రకటించడాన్ని విజయలక్ష్మి తప్పుబట్టారు. హైదరాబాద్ ప్రతిష్ఠను దెబ్బతీసేవిధంగా కేంద్ర ప్రభుత్వం ర్యాంకింగ్ ఇచ్చిందని ఆరోపించారు. రాజకీయ దురుద్దేశంతోనే హైదరాబాద్ ర్యాంకింగ్‌ను తగ్గించారని ఓ ప్రకటనలో ఆమె ఆక్షేపించారు. 24వ ర్యాంకు ప్రకటించడాన్ని హైదరాబాదీయులు అంగీకరించరని చెప్పుకొచ్చారు.
విజయలక్ష్మి ప్రకటనను కొందరు తప్పుబడుతున్నారు. కేంద్రం అంత దిగువస్థాయి ర్యాంక్ ఎందుకు ఇచ్చిందో తెలుసుకొని.. ఆ ప్రమాణాలను మెరుగుపరచాల్సిందిపోగా.. ఎన్ని సమస్యలు ఉన్నా నగరాని అగ్రస్థానం ఇవ్వాలని అనడం సరికాదని హితవు పలుకుతున్నారు. నగర మేయర్‌గా హైదరాబాద్ ర్యాంకును ఎప్పుడు మెరుగుపరుస్తారని ప్రశ్నిస్తున్నారు.