హైదరాబాద్ రాజేంద్రనగర్ లోని పుప్పాలగూడలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాందిశీకుల భూముల్లో ఉన్న నిర్మాణాలను కూల్చివేశారు రెవెన్యూ అధికారులు. భారీ పోలీస్ బందోబస్తుతో సర్వే నెంబర్ 325, 326, 301, 303, 327, 328 లోని నిర్మాణాలను జేసీబీల సాయంతో పడేశారు. అయితే కూల్చివేతను అడ్డుకునేందుకు ప్రయత్నించారు రైతులు. ఆ సమయంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
నిర్మాణాల్లో ఉన్న మహిళలను బలవంతంగా బయటకు రప్పించి మరీ.. కూల్చివేశారు అధికారులు. పలువురికి గాయాలయ్యాయి. ఎంత బతిమిలాడినా కూల్చివేతలు ఆపలేదు. గత 50 ఏళ్లుగా ఈ భూముల్లో వ్యవసాయం చేస్తున్నామని రైతులు తెలిపారు. రైతుల పక్షపాతి అని చెప్పుకునే ప్రభుత్వం.. తమ భూములను అక్రమంగా లాగేసుకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా రాత్రికి రాత్రి వచ్చి ప్రభుత్వ భూములంటూ కూల్చివేశారని మండిపడుతున్నారు రైతులు. కొకాపేట తరహాలో పుప్పాలగూడలో ఉన్న కాందిశీకుల భూములను అమ్ముకోవాలని ప్రభుత్వం చూస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే 50 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్న తమను దౌర్జన్యంగా వెళ్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని అంటున్నారు రైతులు.