ఓ కాలనీలో కరోనా పాజిటివ్ కేసు వస్తే ఆ కాలనీ మొత్తాన్ని కంటైన్మెంట్ జోన్ గా చేసి, లోపలికి ఎవరూ వెళ్లకుండా… లోపలి నుండి ఎవరూ బయటకు రాకుండా లాక్ చేసి కరోనా వ్యాప్తిని అడ్డుకునే వ్యూహంతో ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. అసలు ఈ కంటైన్మెంట్ జోన్ అనేదే తెలంగాణ సర్కార్ మొదలుపెట్టిందని ప్రకటించారు. కానీ ఇప్పుడు ఆ ఆలోచనను పక్కనపెడుతోంది ప్రభుత్వం.
కంటైన్మెంట్ జోన్ల స్థానంలో కంటైన్మెంట్ హౌజ్ ప్రతిపాదన తెరపైకి తెచ్చింది. అంటే… కరోనా పాజిటివ్ వచ్చిన ఇల్లు లేదా అపార్ట్మెంట్ ను మాత్రమే కంటైన్మెంట్ గా ప్రకటించి లాక్ చేస్తారు. లోపల ఉన్నవారికి కావాల్సిన మందులు, నిత్యవసర సరుకులను ప్రభుత్వమే డోర్ డెలివరీ చేస్తుంది. ఇందుకోసం ప్రత్యేకంగా యంత్రంగాన్ని ఏర్పాటు చేశామని, ఆ ఇంట్లో ఉన్న వారి నుండి ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ప్రకారం పరీక్షలు చేస్తామని జీహెచ్ఎంసీ అధికారులు ప్రకటించారు.
కానీ ఓ వ్యక్తికి పాజిటివ్ వచ్చిన నాటి కన్నా కనీసం 14 రోజుల ముందే వైరస్ లక్షణాలు సోకి ఉంటాయి. అప్పుడా వ్యక్తి ఆ కాలనీలో ఎక్కడైనా తిరిగి ఉండొచ్చు. కానీ ఇప్పుడా వ్యూహాన్ని మార్చి కేవలం కంటైన్మెంట్ హౌజ్ ప్రతిపాదనపై పలువురు పెదవి విరుస్తున్నారు.
ఎలాగూ సరిపడా టెస్టులు చేయటం లేదు, ఇప్పుడు కంటైన్మెంట్ జోన్లలోనూ మార్పులు చేస్తే కేసుల వ్యాప్తి ఊహించనంతగా ఉంటుందని, తెలంగాణలో కేసులు ప్రమాదకర స్థాయికి చేరుకుంటాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.