జీహెచ్ఎంసీ కౌన్సిల్ భేటీ యుద్ధ వాతావరణాన్ని తలపించింది. అధికార, విపక్ష నేతల మాటల యుద్ధం ఓ రేంజ్ లో కొనసాగింది. బడ్జెట్ పై చర్చ సందర్భంగా టీఆర్‌ఎస్, ఎంఐఎం కార్పొరేటర్ల మధ్య వివాదం నడిచింది. బడ్జెట్ అంతా ఇల్లీగల్ అంటూ ఎంఐఎం సభ్యులు ఫైరవ్వగా.. టీఆర్‌ఎస్ కార్పొరేటర్లు కేకలు వేశారు. దీంతో సమావేశంలో గందరగోళం నెలకొంది.
సభ్యులు ఎవరూ వినిపించుకోకపోవడంతో టీ బ్రేక్ ఇచ్చారు మేయర్ విజయలక్ష్మి. తర్వాత ప్రారంభమైన సమావేశంలో సేమ్ సీన్ రిపీట్ అయింది. కాకపోతే ఈసారి టీఆర్‌ఎస్, బీజేపీ కార్పొరేటర్ల మధ్య యుద్ధం నడిచింది. జీహెచ్ఎంసీని అప్పుల కుప్పగా మార్చారని బీజేపీ కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా జీహెచ్ఎంసీకి రావటం లేదని ఆరోపించారు బీజేపీ కార్పొరేటర్లు. దీంతో టీఆర్‌ఎస్ శ్రేణులు పెద్దగా నినాదాలు చేశారు. బీజేపీ వాళ్లకు వరికి గోధుమలకు తేడా తెలియదని విమర్శించారు. తాము ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తుంటే.. పక్కదారి పట్టిస్తున్నారంటూ పోడియం వద్దకు వెళ్లారు బీజేపీ సభ్యులు. టీఆర్‌ఎస్ నేతలు కూడా ఎంతకీ తగ్గలేదు. దీంతో కౌన్సిల్ భేటీని మేయర్ మరోసారి వాయిదా వేశారు.
తొలుత జీహెచ్‌ఎంసీ వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టి ఆమోదించాల్సిందిగా సభను కోరారు మేయర్. ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ.. 2022-23 ఏడాదికి సంబంధించి రూ.6,150 కోట్లతో జీహెచ్‌ఎంసీ వార్షిక బడ్జెట్ ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. రోడ్ల అభివృద్ధి స్కైవేలు, వంతెనల కోసం రూ.1,500కోట్లు కేటాయించినట్లు వివరించారు. ఎస్ఎన్డీపీలో భాగంగా చేపడుతున్న పనులకు రూ.340 కోట్లు, ఇతర నాలా పనుల నిర్వహణకు రూ.200 కోట్లు, ఈ ఏడాది వరద నివారణ కోసం రూ.340 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. నగరంలో పచ్చదనం పెంపునకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు వివరించారు. గ్రీనరీ పెంపునకు రూ.332.23 కోట్లతో గ్రీన్ బడ్జెట్ ప్రవేశపెట్టినట్లు మేయర్ తెలిపారు.