కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ వాహనం చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతిచెందారు. వారిలో ముగ్గురు చిన్నారులు ఉన్నట్టు స్థానికులు తెలిపారు. ఈ దారుణ ప్రమాదం ధార్వాడ్ సమీపంలోని నిగాది గ్రామం వద్ద చోటుచేసుకుంది.
ఎస్పీ కృష్ణకాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. బెనకానాకట్టి గ్రామానికి చెందిన సుమారు 21 మంది.. శుక్రవారం మన్సూర్ గ్రామంలో జరిగిన ఫ్యామిలీ ఫంక్షన్ కు మల్లీ యుటిలిటీ వాహనంలో వెళ్లారు. కార్యక్రమాన్ని ముగించుకొని తిరిగి స్వగ్రామానికి బయలుదేరారు.
మార్గమద్యంలోకి రాగానే వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కనున్న చెట్టును ఢీ కొట్టింది. దీంతో వాహనం పల్టీ కొట్టి రోడ్డు పక్కకు పడిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడిక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురు హాస్పిటల్ కు తరలిస్తుండగా మృతి చెందినట్టు ఎస్పీ తెలిపారు.
ప్రమాదంలో గాయపడిన మరో 10 మంది క్షతగాత్రులను హుబ్లీ కిమ్స్ ఆస్పిటల్ తరలించి చికిత్స అందిస్తున్నామన్నారు ఎస్పీ. కేసు నమోదు చేసుకున్న ధార్వాడ్ రూరల్ పోలీసులు.. ఘటనకు గల కారణాలను ఆరా తీస్తున్నారు.