చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ తయారీదారు జియోనీకి చెందిన ఫోన్లను వాడుతున్నారా ? అయితే మీకు షాకింగ్ లాంటి వార్త. ఏమిటంటే.. జియోనీ కంపెనీ తన ఫోన్లలోకి హానికర మాల్‌వేర్‌ను కావాలనే చొప్పించిందని, దాని ద్వారా పెద్ద ఎత్తున ఆదాయం ఆర్జించిందని గుర్తించారు. ఈ వార్త ప్రస్తుతం దుమారం రేపుతుండగా.. ఈ సంఘటనకు పాల్పడిన ముగ్గురు ఉద్యోగులకు చైనాలోని ఓ కోర్టు భారీ జరిమానా, జైలు శిక్షను విధించింది.
డిసెంబర్ 2018 నుంచి అక్టోబర్ 2019 వరకు జియోనీకి చెందిన షెంజెన్ జిపు టెక్నాలజీ కో లిమిటెడ్ అనే కంపెనీ యూజర్ల ఫోన్లలోకి స్టోరీ లాక్ స్క్రీన్ అనే యాప్ ద్వారా ఓ ట్రోజన్ హార్స్‌ను ప్రవేశపెట్టింది. సాఫ్ట్‌వేర్ అప్ డేట్ రూపంలో సదరు మాల్‌వేర్‌ను జియోనీ ఫోన్లలో ప్రవేశపెట్టారు. ఆ సంఘటన యూజర్ల ప్రేమయం లేకుండానే చోటు చేసుకుంది. దీంతో యూజర్ల ఫోన్లలో యాడ్స్ కనిపించాయి. ఈ క్రమంలో ఆ మాల్‌వేర్‌ను ఫోన్లలో ప్రవేశపెట్టడం ద్వారా జియోనీ దాదాపుగా 4.2 మిలియన్ డాలర్ల (దాదాపుగా రూ.31 కోట్లు) ఆదాయాన్ని యాడ్స్ రూపంలో సంపాదించింది. మొత్తం 2 కోట్ల మందికి పైగా జియోనీ ఫోన్లలో ఈ మాల్‌వేర్ వ్యాప్తి చెందిందని గుర్తించారు.
కాగా ఈ సంఘటనతో ప్రమేయం ఉన్న సంస్థ ఉద్యోగులు షు లి, జు యింగ్, జియా జెంగ్‌కియాంగ్‌లకు 3 ఏళ్లపాటు జైలు శిక్షను విధించారు. మరో దోషి పాన్ కి కి కోర్టు 6 నెలల జైలుశిక్ష విధించింది. ఒక్కొక్కరికి 2 లక్షల చైనా యెన్‌లను (దాదాపుగా రూ.22.57 లక్షలు) కోర్టు జరిమానాగా విధించింది.
కాగా 2002లో జియోనీ సంస్థను ఏర్పాటు చేయగా చైనాలో అప్పట్లో అతి పెద్ద మొబైల్ తయారీ సంస్థగా ఉండేది. దాన్ని 2018లో కార్బన్ మొబైల్స్ కంపెనీ జైన్‌గ్రూప్ కొనుగోలు చేసింది. అయితే జియోనీ ఫోన్లలో ఈ విధంగా మాల్‌వేర్‌ను ప్రవేశపెట్టి వాటి ద్వారా యూజర్ల ఫోన్లలో అవాంచిత యాడ్స్ ఇస్తూ వాటి నుంచి పెద్ద ఎత్తున ఆదాయం సంపాదించడం ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది. అయితే భారత్‌లో ఉన్న పలు ఇతర చైనా కంపెనీలకు చెందిన ఫోన్లలోనూ ఇలాగే యాడ్స్ కనిపిస్తుంటాయి. కానీ అవి కంపెనీలకు చెందిన అడ్వర్టయిజ్‌మెంట్ ప్రోగ్రామ్‌ల ద్వారా వస్తున్నవి. ఈ క్రమంలో ఫోన్లలో ఇలా యాడ్స్ కనిపించడం అనేది చర్చనీయాంశంగా కూడా మారింది.