రెండు రోజుల నుంచి ప్రధాన ఛానల్స్ లో ఒకటే న్యూస్. హీరో సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్. రాష్ట్రంలో ఇకేం సమస్యలు లేవన్నట్టు చిత్ర విచిత్రమైన రిపోర్టింగ్ చేస్తూ నవ్వుల పాలవుతున్నాయి. ఆఖరికి సైదాబాద్ లో ఆరేళ్ల చిన్నారిని చంపేస్తే పట్టించుకున్న పాపానపోలేదు. దీంతో సోషల్ మీడియా వేదికగా ఓ రేంజ్ లో ఆటాడుకుంటున్నారు నెటిజన్స్. ఇటు చిన్నారి కుటుంబానికి అండగా నిలిచిన గిరిజన సంఘాలు… రిలే నిరాహార దీక్ష చేపట్టాయి.
ఓ హీరో బైక్ స్కిడ్ అయి పడిపోతే.. అతని కుటుంబం బాధలో ఉంటే.. ఆ బైక్ ఏంటి..? టైర్ ఎలా వంగింది.. దాని రేటెంత..? అని రాతలు రాసిన ఛానళ్లు… ఆరేళ్ల చిన్నారిని చంపేస్తే ఎందుకు కవర్ చేయడం లేదని ప్రశ్నిస్తున్నాయి గిరిజన సంఘాలు. అసలు.. ప్రధాన ఛానళ్లు ఎక్కడకు పోయాయని.. చిన్నారి చనిపోయింది కనిపించడం లేదా..? అని నిలదీస్తున్నాయి. రేటింగ్స్ కోసం ఇంతగా దిగజారతారా..? గిరిజన బిడ్డలంటే అంత చులకనా..? అంటూ మండిపడుతున్నాయి.
అసలు.. గిరిజన నాయకులు బతికే ఉన్నారా అని ప్రశ్నించారు గిరిజన సంఘాల నేతలు. టీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకుల బ్యానర్లు పెట్టి చెప్పులతో కొట్టారు. గిరిజన నాయకులు అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. మా ఓట్లు కావాలి.. సమస్యలు మాత్రం పట్టవా..? అని ప్రశ్నించారు. అగ్రవర్ణాల్లో అమ్మాయిలపై అఘాయిత్యాలు జరిగితే హడావుడి చేస్తారు.. అదే గిరిజన అమ్మాయిలకు జరిగితే పట్టించుకోరా..? సీఎం కేసీఆర్ ఎక్కడికి పోయారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు ఎటు పోయారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తమకు బుద్ధి వచ్చిందని.. ఇకపై ఓట్ల కోసం వస్తే పూలమాలలు కాదు.. చెప్పుల దండలు వేస్తామని హెచ్చరించారు గిరిజనులు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి బానిసలుగా ఉన్న ఛానళ్లు, ఎమ్మెల్యేలను చెప్పులతో కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని మండిపడ్డారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని.. నిందితుడికి ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే అన్ని జిల్లాల్లో దీక్షలకు దిగుతామని స్పష్టం చేశారు. అది చేస్తాం ఇది ఇస్తాం అంటూ చిన్నారి కుటుంబాన్ని మభ్య పెట్టేందుకు చూస్తున్నారని.. అయినా.. మీరు డబ్బులు ఇచ్చేదేంటి..? మేమే జోలి పట్టి మా సంఘాల తరఫున కోటి రూపాయలు ఇస్తాం.. నిందితుడికి ఉరిశిక్ష వేయండని చెప్పారు గిరిజన సంఘాల సభ్యులు.
మరోవైపు చిన్నారి కుటుంబం కూడా అదే అంటోంది. కూలీ పని చేసుకుని అయినా బతుకుతాం.. డబ్బులు ఏమీ అవసరం లేదని కన్నీరు మున్నీరు అవుతోంది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తోంది.