పోడు భూములు పోతాయోమేనన్న భయం.. ఆ అడవి బిడ్డల్లో ఆవేశాన్ని రగిల్చింది. ఫారెస్టు ఆఫీసర్లపై ఆగ్రహం కట్టలు తెంచుకునేలా చేసింది. తమ నోటికాడి ముద్దను ఎక్కడ లాక్కుంటారోనన్న ఆందోళనతో గిరిజనబిడ్డలంతా ఏకమై ఎదురు తిరిగారు. పోడు భూముల్లోకి అడుగుపెట్టిన పోలీసులని ఈడ్చుకొచ్చి చెట్లకు కట్టేశారు. చేతికి ఏది దొరికితే అది తీసుకొచ్చి వాటితో వారిని బంధించారు. తమను ఏం చేద్దామని వచ్చారంటూ ఆఫీసర్లపై నిప్పులు కక్కారు. కర్రలు చేతబట్టుకొని దాడికి ప్రయత్నించబోయారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. దుమ్ముగూడెం మండలం చింతగుప్పలో ఈ ఘటన జరిగింది. స్థానిక గిరిజనులు సాగు చేస్తున్న పొడు భూములను స్వాధీనం చేసుకునేందుకు ఫారెస్ట్ బీట్ అధికారులు వెళ్లగా.. ఇలా తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. ఆసిఫాబాద్ జిల్లాలో ఫారెస్ట్ బీట్ అధికారులపై బాధితులు ఎదురు తిరిగి కర్రలతో దాడి చేశారు.
మరోవైపు ప్రభుత్వం అనాలోచిత చర్యల వల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. పోడుభూములు సాగుచేసుకుంటున్న రైతులకు పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం.. దాన్ని అమలు చేయకుండా హరితహారం పేరుతో ఆ భూములను స్వాధీనం చేసుకుని మొక్కలు నాటుతోంది. దీంతో అడవి బిడ్డలు రగిలిపోతున్నారు.