నాగర్ కర్నూలు జిల్లాలో 7వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని క్లాస్ రూమ్ లో ఫ్యాన్ కు ఉరేసుకుని సూసైడ్ కి పాల్పడిన ఘటన ప్రస్తుతం తీవ్ర కలకలం రేపుతోంది. అమ్రాబాద్ మండలం మన్ననూర్ గ్రామంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల – కళాశాలలో నిఖిత అనే విద్యార్థిని ఏడవ తరగతి చదువుతుంది. మూడు రోజుల క్రితం తోటి విద్యార్థులతో మనస్పర్థలు వచ్చాయి.
ఈ విషయం పాఠశాల ఉపాధ్యాయులకు తెలియడంతో ఇద్దరు విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. అయితే ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో కానీ మంగళవారం సాయంత్రం బాలిక తరగతి గదిలోకి వెళ్లి ఫ్యాన్ కు చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు సూసైడ్ కి గత కారణాలపై ఆరా తీస్తున్నారు. బాలిక ఎందుకు చనిపోయింది? దీని వెనుక ఉన్న కారణం ఏంటన్నదానిపై పోలీసుల విచారణ చేస్తున్నారు.
అయితే విషయం తెలుసుకున్న విద్యార్థిని తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారు. క్లాస్ టీచర్ వేధింపులే విద్యార్ధిని ఆత్మహత్యకు కారణమని ఆరోపిస్తున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. స్కూల్ లో జరుగుతున్న విషయాలపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని తోటి విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు.
ఈ ఘటనపై ఎన్ఎస్ యూఐ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు కార్యకర్తలపై దురుసుగా ప్రవర్తించడంతో పాటు.. లాఠీ ఛార్జ్ కూడా చేశారు. దీంతో ఎన్ఎస్ యూఐ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. పలువురు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.