ఢిల్లీలో అంజలి అనే యువతిని కారు 12 కిలోమీటర్లు ఈడ్చుకు వెళ్లిన ఘటన తెలుసుకదా. సరిగ్గా అలాంటి ఘటనే యూపీలోనూ చోటు చేసుకుంది. అది కూడా ఢిల్లీ ఘటన జరిగిన రోజే చోటు చేసుకోవడం గమనార్హం. అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పోలీసుల వివరాల ప్రకారం… న్యూ ఇయర్ రోజున కౌశాంబీ జిల్లాలోని దేవ్ కర్ పూర్ గ్రామానికి చెందిన విద్యార్థి కంప్యూటర్ క్లాసుకు వెళుతోంది. ఇంతలో ఓ కారు వచ్చి ఆమెను ఢీ కొట్టింది. దీంతో సైకిల్ తో సహా బాలిక కారు టైరులో ఇరుక్కు పోయింది.
అయితే డ్రైవర్ కారును ఆపకపోవడంతో బాలికను 200 మీటర్ల వరకు కారు ఈడ్చుకు వెళ్లింది. ఈ క్రమంలో కారు అదుపుతప్పింది. ఈ ఘటనలో బాలికకు ఓ కాలు, ఓ చేయి విరిగింది. దీంతో పాటు బాలికకు ముఖం, ఛాతీ భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి.
కారు అదుపు తప్పడంతో అటు నిందితుడికీ గాయాలయ్యాయి. అనంతరం నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ప్రస్తుతం బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుని కోసం గాలింపు చర్యలు చేపట్టారు.