పాలకుల నిర్లక్ష్యానికి మరో ప్రాణం బలయింది. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం బిజ్జారం అనుబంధ గ్రామం బొంకూరులో అనారోగ్యంతో బాలిక చనిపోయింది. బాలప్ప, అమృతమ్మల కుమార్తె హారిక నాలుగు రోజుల క్రితం అనారోగ్యానికి గురైంది. బిజ్జారం, బొంకూరు గ్రామాల మధ్యలో ఉన్న కాగ్నానది భారీ వర్షాలకు ఉప్పొంగింది. దీంతో ఆసుపత్రికి తీసుకెళ్లలేకపోయారు కుటుంబసభ్యులు.
బాలిక ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు గ్రామానికి మరోవైపు ఉన్న పెద్దేముల్ మండలం రుక్మాపూర్ మీదుగా తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ.. ఆ మార్గంలో కూడా భారీ వర్షాలకు దారి బురదమయంగా మారింది. అయినా కూడా అదే మార్గంలో తరలిస్తుండగా ట్రాక్టర్ బురదలో ఇరుక్కుపోయింది. దీంతో చేసేదిలేక భుజాలపై మోసుకెళ్లారు కుటుంబసభ్యులు. రైలు పట్టాల గుండా తాండూరుకు చేరుకున్నారు.
బాలికను జిల్లా ఆసుపత్రిలో చేర్పించగా పరిస్థితి ఆందోళనకరంగా ఉందని.. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించాలని సూచించారు డాక్టర్లు. వెంటనే అక్కడి నుంచి హైదరాబాద్ నిలోఫర్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. అయినా ఫలితం లేదు. చికిత్స పొందుతూ బాలిక మృతి చెందింది.
బొంకూరు నుంచి తాండూరుకు వెళ్లాలంటే వాగుపై వంతెన నిర్మించాలి. అది లేకపోవడం వల్లే బాలిక చనిపోయిందని… తమ సమస్యను ఎవరూ పట్టించుకోవడం లేదని గ్రామస్తులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు కదలాలని అంటున్నారు.