ప్రియురాలిని అత్యంత దారుణంగా హతమార్చాడు ప్రియుడు. ఏకంగా 15 సార్లు కత్తితో పొడిచి తన పైశాచికత్వాన్ని బయటపెట్టాడు. ఈ ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ కాకినాడకు చెందిన లీలా పవిత్ర అనే యువతి, శ్రీకాకుళానికి చెందిన దినకర్ బాణాల అనే యువకుడు గత ఐదు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు.
లీలా పవిత్ర ఎంఎస్సీ వరకు చదివింది. బెంగళూరులో హెల్త్ కేర్ మేనేజ్ మెంట్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్స్ లో లీలా ఉద్యోగం చేస్తుంది. దినకర్ కూడా బెంగళూరులోని మలూరులో హాస్టల్ లో ఉంటూ ఓ హెల్త్ కేర్ కంపెనీలో పని చేస్తున్నాడు.
కొద్ది నెలల కిందట వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకోగా.. ఇద్దరి కులాలు వేరుకావడంతో కుటుంబ సభ్యులు వ్యతిరేకించారు. ఆ తర్వాత లీలా పవిత్ర దినకర్ ను దూరం పెట్టింది. అలాగే పలుసార్లు దినకర్ ఫోన్ చేసేందుకు ప్రయత్నించగా.. స్పందించ లేదు. దీంతో కక్ష్య పెంచుకున్న దినకర్ పక్కా ప్రణాళికతో పవిత్ర పని చేస్తున్న ఆఫీసు వద్ద వచ్చాడు.
రాత్రి 7:30లకు లీలా కార్యాలయం నుంచి బయటకు రాగానే కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. దీంతో యువతి అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని నిందితుడిని అరెస్టు చేశారు. అతనిపై హత్య కేసు నమోదు చేశారు.