పెద్దలు పెంచుకున్న కక్షలకు ఎనిమిదేళ్ల చిన్నారి ప్రాణాలు బలయ్యాయి. బిహార్‌లోని భోజ్‌పుర్ జిల్లాలోని ఉద్వంత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ దుర్ఘటన పలువురిని కలచివేసింది.
ఇంట్లోకి చొరబడి బాలికపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడ్డ చిన్నారి.. అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయింది.భూతగాదాలే ఘటనకు కారణంగా తెలుస్తోంది. ఈ కాల్పుల్లో క్రిష్ణ సింగ్ అనే వ్యక్తి కూతురు..ఆరాధ్య మృతి చెందింది.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు..వెంటనే అక్కడికి చేరుకున్నారు. చిన్నారి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని.. శవ పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ఘటన జరిగిన రాత్రి తొమ్మిది గంటల సమయంలో కృష్ణ సింగ్ కుటుంబ సభ్యులు.. భోజనం చేసి పడుకున్నారు. కూతురు ఆరాధ్య మాత్రం హోంవర్క్ చేసుకుటుంటోంది. అదే సమయంలో చిన్నారికి తలుపులు కొడుతున్న శబ్ధం వినిపించింది.
దీంతో ఆరాధ్య వెళ్లి ఇంటి తలుపులు తీసింది. నలుగురు వ్యక్తులు ఆయుధాలతో ఇంట్లోకి చొరబడ్డారు. ఇది గమనించిన మిగతా కుటుంబ సభ్యులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు.
వారందరిని ఆ నలుగురు తుపాకులతో బెదిరించారు. అనతంరం చిన్నారికి తుపాకీ గురి పెట్టి.. తన తండ్రి కృష్ణ సింగ్ ఎక్కడ అని అడిగారు. దానికి బాలిక తనకు తెలియదని చెప్పింది. దీంతో చిన్నారిపై కాల్పులు జరిపిన దుండగులు.. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు.
“కృష్ణ సింగ్‌కు గ్రామంలోని మరో వ్యక్తితో ఆస్తి వివాదం నడుస్తోంది. మొత్తం 25 ఎకరాల భూమి విషయంలో వీరిద్దరికి వివాదం జరుగుతోంది. ఇదే వివాదంలో కొద్ది రోజుల క్రితం కృష్ణ సింగ్ సోదరున్ని కూడా కాల్చి చంపారు దుండగులు. చిన్నారి హత్యకు కూడా ఈ వివాదమే కారణమని భావిస్తున్నాం.” అని పోలీసులు తెలిపారు.
ఘటనపై కేసు నమోదు చేసుకున్నామని వారు వెల్లడించారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నట్లు పేర్కొన్నారు. ఇదే తరహలో కొద్ది రోజుల క్రితం ఓ చిన్నారిపై దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆరేళ్ల చిన్నారి మృతి చెందింది.
బైక్‌పై వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు.. తండ్రి ఎదుటే కొడుకును కాల్చి చంపారు. పంజాబ్‌లో ఈ దారుణ ఘటన జరిగింది. బాలుడి తండ్రిని చంపేందుకు వచ్చిన దుండుగులు.. గురితప్పి చిన్నారిని కాల్చి చంపారు.