అమ్మాయి అబ్బాయి పీకల దాకా ప్రేమించుకున్నారు. ప్రేమించుకున్నది చాలు పెళ్ళి చేసుకుందామన్నాడు అబ్బాయ్. లైట్ తీసుకో అంది అమ్మాయ్. మళ్ళీ అడిగాడు.తర్వాత చూద్దాం అంది. ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు ఏదోటి తేల్చు అన్నాడు. అంతే !’కట్’ చేస్తే ప్రియుడి యాభై కుట్లు.ఏంటీ వింత అనుకుంటున్నారా !? రోజులు మారాయ్. ఎప్పుడూ ప్రతీ అమ్మాయికీ ఓ రోజొస్తుంది అన్నట్టుగా..విసిగి పోయిందో ! వదిలించుకోవాలనుకుందో ! ప్రేమ ఏమైందో తెలియదు కాని,ఆ క్షణంలో ఉన్మాదిగా మారిపోయింది. ప్రియుణ్ణి విచక్షణలేకుండా కోసింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన, హైదరాబాద్ కె.పి.హెచ్.బి పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం సృష్టించింది.
గుంటూరుకు చెందిన నాదెండ్ల అశోక్, రోడ్ నంబర్ .4 లోని ఓ హాస్టల్లో ఉంటూ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. రాజమండ్రికి చెందిన లక్ష్మీసౌమ్య, అదే రోడ్డులోని ఓ హస్టల్ లో ఉంటూ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తుంది. వీరిద్దరికీ స్థానికంగా ఉండే ఒక టీ స్టాల్ వద్ద పరియచయం ఏర్పడింది. కొద్దిరోజులకు అతను ప్రేమిస్తున్నానని, పెళ్ళిచేసుకుంటానని ఆమెకు చెప్పాడు.దీంతో చాలా కాలం చెట్టాపట్టాలేసుకుని సినిమాలకు షికార్లకు తిరిగారు. ఈ క్రమంలో లక్ష్మీసౌమ్యకు,చాలానే ఖర్చుపెట్టాడు అశోక్.
ఈ నెల 5 న సేమ్ టీస్టాల్లో కలుసుకున్నారు. ఎప్పట్లాగే సౌమ్య దగ్గర అశోక్ పెళ్ళిప్రస్తావన తెచ్చాడు. ఆమె నో చెప్పింది. వాళ్ళిద్దరి మధ్య వాగ్వాదం పెరిగింది. ఈ గొడవ కాస్తా తీవ్ర స్థాయికి చేరుకుంది. కోపంతో ఊగిపోయిన సౌమ్య తనతో తెచ్చుకున్న మినీ కట్టర్ తో అశోక్ పై దాడి చేసింది. విచక్షణా రహితంగా దాడిచేసింది. లక్ష్మీ సౌమ్య తాను అనుకున్నంత సౌమ్యురాలు కాదని అశోక్ కి ఆలస్యంగా తెలిసింది.
సౌమ్య దాడిలో అశోక్ చెంపకింద భాగంలో తీవ్ర గాయమయ్యింది. గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం అతన్ని ఆసుపత్రికి తరలించారు. ఈ వ్యవహారం అశోక్ కుటుంబానికి తెలియడంతో హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్న కుటుంబ సభ్యులు బోరున విలపించారు. ఈ ఘటనకు కారకురాలైన సౌమ్యపై బాధితుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసునమోదు చేసారు. నిందితురాలిపై హత్యాయత్నం కేసు నమోదు చేసుకొని,అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.రాత్రి 7 గంటల సమయంలో స్థానిక టీస్టాల్లో పెళ్ళి ప్రస్తావన తీసుకురావడంతో అమ్మాయి తనతో తెచ్చుకున్న బ్లేడుతో అశోక్ ని గాయపరిచిందని పోలీసులు తెలిపారు. అశోక్ కుమారు కి 50 కుట్లు వేసినట్లు డాక్టర్స్ రిపోర్ట్ ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు.