ప్రేమించిన యువతికి వేరే వాడితో పెళ్లి అవుతోందని తెలిసి..ప్రేమికుడు తాళికట్టే సమయానికి వెళ్లి ఆపండి అనడం సహజంగా సినిమాల్లో చూస్తుంటాం.కానీ..ఇక్కడ నిజ జీవితంలో మాత్రం ఓ యువతితో ఎనిమిదేళ్లుగా ప్రేమలో ఉన్నఓ యువకుడు వేరే అమ్మాయిని వివాహం చేసుకోవటానికి సిద్ధమయ్యాడు. విషయం తెలుసుకున్నఅమ్మాయి చివరి నిమిషంలో ఆ పెళ్లిని ఆపే ప్రయత్నం చేసింది.ఈ ఘటన ఖమ్మం జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డు పక్కన ఉన్న ఓ ఫంక్షన్ హాల్ వద్ద జరిగింది.
మహబూబాద్ జిల్లా గార్లకు చెందిన శ్రీనాథ్ అనే యువకుడు,అదే ప్రాంతానికి చెందిని అమ్మాయి..ఎనిమిదేళ్లుగా ప్రేమించుకున్నారు. తననే పెళ్లి చేసుకుంటానని చెప్పి శారీరకంగా దగ్గరయ్యాడని బాధితురాలు చెప్తోంది. పెళ్లి విషయం మాట్లాడిన ప్రతిసారీ మాటదాటేసే వాడని..ఇప్పుడు ఖమ్మం వచ్చిరహస్యంగా వేరే పెళ్లి చేసుకుంటున్నాడని యువతి ఆరోపించింది.తనకు అన్యాయం జరుగుతోందని తెలుసుకొని వివాహాన్నిఆపాలని వచ్చినట్టు ఆ యువతి వెల్లడించింది.
కాగా.. వివాహం జరుగుతున్న సమయంలో మండపం లోపలికి ప్రవేశించిన ఆమెను వరుడి తరుపు బంధువులు అడ్డుకున్నారు.అయినప్పటికీ వారిని ప్రతిఘటించి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించింది ఆ యువతి. దీంతో ఆగ్రహించిన వరుడి తరుపు బంధువులు..ఆమెను కిందపడేసి జట్టు పట్టుకుని బయటకు లాక్కెళ్లారు.’నీ కొడుకు నన్నుప్రేమించి మోసం చేశాడు..న్యాయం చేయండి’ అని వేడుకుంటున్నావినకుండా దాడికి దిగారు ప్రేమికుడి తల్లిదండ్రులు.ఇదంతా చూస్తున్నఓ పోలీసు అధికారి కనీసం ఆమెపై జరుగుతున్న దాడిని ఆపేందుకు యత్నించకపోవడం గమనార్హం.
తన కళ్లముందే ఇదంతా జరుగుతున్నా..పెళ్లి కుమారుడు మాత్రం బయటకు వచ్చి సంజాయిషీ చెప్పుకొనేందుకు యత్నించలేదని బాధితురాలు వాపోయింది.పెళ్లి కూతురు కానీ..ఆమె తరఫు బంధువులు కానీ..అసలేం జరుగుతుంది..నిజానిజాలు తేలాకే పెళ్లి జరిపిద్దాం అనే ఆలోచనా కూడా చేయలేదని కంటనీరు పెట్టుకుంది ఆ యువతి.ఓ వైపు ప్రేమించినవాడి మౌనం..మరో వైపు అతడి బంధువుల అరాచకత్వానికి మానసికంగా, శారీరకంగా కుంగిపోయిన యువతి..తనకు జరిగిన అన్యాయాన్ని తలచుకుని మీడియా ఎదుట కుమిలి కుమిలి ఏడ్చింది.
పోలీసులు సైతం వాళ్లకే మద్దతుగా ఉన్నారని..తన బాధను పట్టించుకోవడం లేదని వాపోయింది.ఎనిమిదేళ్ల తన ప్రేమబంధాన్నిదక్కించుకోవాలని చేసిన పోరాటంలో తాను విఫలం అయ్యానని మొరపెట్టుకుంది.ఎంత పోరాటం చేసినా..చివరికి తాను ఒంటరిగానే మిగలాల్సి వచ్చిందని వాపోయింది.ఓ వైపు తనపై దాడి జరుగుతున్నా..మరోవైపు వేరే అమ్మాయితో పెళ్లి చేసుకున్నప్రేమికుడి నయవంచనను భరించలేకపోయిన యువతి.. కన్నీళ్లతోనే పోలీస్స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది.