మా పెద్దొనికి పెండ్లి చేయాలే పిల్లను చూడరాదు జెర, మీది మ్యారేజ్ బ్యూరోనే కదా… మరీ పిల్లను ఇంకెన్నాళ్లకు చూపిస్తరు, కట్నం లేకున్నా పర్వాలేదు మా ఇంట్లో కలిసిపోయేలా అమ్మాయి ఉంటే మా కొడుక్కి చేసుకుంటాం…. ఈ మధ్య ఈ మాటలే ఎక్కువగా వినిపిస్తున్నాయి.
అవును… తెలుగు రాష్ట్రాల్లో పెళ్ళికాని ప్రసాద్‌ల సంఖ్య పెరిగిపోతుందట. కట్న కానుకలతో పనిలేకుండా మంచి ఇంటి సంబంధం అయితే చాలు అనుకునే అబ్బాయి తరుపు వారు ఎక్కువవుతున్నారని గణంకాలు కూడా చెబుతున్నాయి. అయితే అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిల సంఖ్య తక్కువగా ఉండటం ఓ కారణమైతే, పెళ్లి విషయంలో అమ్మాయిలు జాగ్రత్తగా సెలక్ట్ చేసుకుంటుండటం కూడా ఓ కారణమని తెలుస్తోంది.
గతంలో… పెళ్లి అనగానే అబ్బాయికి, అమ్మాయి తరుపు వారికి నచ్చితే చాలు, కానీ ఇప్పుడా ట్రెండ్ మారిపోయింది. అమ్మాయిలు కూడా తమకు నచ్చిన అబ్బాయి అయితేనే పెళ్లికి ఓకే చెబుతున్నారు. అబ్బాయి వయస్సు, చదువు, సంపాదన, బ్యాక్‌గ్రౌండ్ ఇలా అన్నీ బేరీజు వేసుకున్న తర్వాతే పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. దీంతో పెళ్లికాని ప్రసాద్‌ల సంఖ్య పెరిగిపోతుంది. కొన్ని కులాల్లో అయితే అమ్మాయిలు దొరకటం చాలా కష్టంగా ఉందట. వారయితే… అనాథాశ్రమాల్లోనూ అమ్మాయిల కోసం ప్రయత్నిస్తున్నారట.
అయితే ఇప్పటి వరకు ప్రతి 1000మంది పురుషులకు 928మందిగా ఉన్న స్త్రీ, పురుష నిష్పత్తి కొన్ని చోట్ల పెరుగుతుండగా, మరికొన్ని చోట్ల తగ్గుతోంది. అయితే… లైఫ్ సెక్యూర్ అంశమే పెళ్లికాని ప్రసాద్‌ల సంఖ్య పెరగటానికి అసలు కారణంగా కనపడుతోంది.