ఏపీకి భారీగా పెట్టుబడులను రప్పించడమే లక్ష్యంగా గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ (జీఐఎస్) నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఈ సమ్మిట్ లో పాల్గొనేందుకు సీఎం జగన్, కేంద్ర, రాష్ట్ర మంతులు, కార్పొరేట్ దిగ్గజాలు వైజాగ్ కు చేరుకుంటున్నారు. దేశ వ్యాప్తంగా ప్రముఖ పారిశ్రామిక వేత్తలతో పాటు అంతర్జాతీయ కార్పొరేట్ సంస్థలకు విశాఖ నగరం ఆతిథ్యం ఇవ్వబోతుంది.
ఈ నేపథ్యంలో జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. వైజాగ్ లో 4 కొత్త బీచ్ లను ఏర్పాటు చేస్తోంది ప్రభుత్వం. విశాఖ అంటే ఎవ్వరికైనా ముందు గుర్తొచ్చేది బీచ్ లే. ఆ తర్వాతే ఏవైనా.. అంతలా పర్యాటకులను అట్రాక్ట్ చేస్తాయ్ అక్కడి బీచ్ లు. ఆల్రెడీ ఉన్న బీచ్ లకు అదనంగా మరో నాలుగు కొత్త బీచ్ లను సిద్ధంచేస్తోంది జీవీఎంసీ.
జోడుగుళ్లపాలెం, సాగర్ నగర్, మంగమారిపేట, తొట్లకొండ బీచ్ లను అభివృద్ధి చేస్తోంది ప్రభుత్వం. యుద్ధ ప్రాతిపదికన పనులు కూడా జరుగుతున్నాయి. 25 కిలో మీటర్ల స్ట్రెచ్ లో కొత్త బీచ్ లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ పనుల పురోగతిని మంత్రి ఆదిమూలపు సురేష్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ ను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతోందన్నారు.
ఇప్పటికే 12 వేల మంది వరకు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని చెప్పారు. సిటీలో బ్యూటీఫికేషన్ పై ప్రత్యేక శ్రద్ద పెట్టామన్నారు. రోడ్ల మరమ్మతులు, ఎలక్ట్రీషియన్ వర్క్స్ పూర్తి అయినట్లు తెలిపారు. విశాఖనే రాష్ట్ర రాజధాని అని ముఖ్యమంత్రి జగన్.. ఢిల్లీ సమావేశంలో స్పష్టం చేశారని గుర్తు చేశారు. హోటల్స్ లో దాదాపు వెయ్యి రూమ్స్ రిజర్వ్ అయ్యాయని చెప్పారు మంత్రి ఆదిమూలపు సురేష్.