వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాల పీజీ విద్యార్థిని మృతి చెందడానికి గల కారణాలపై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని గవర్నర్ తమిళి సై కళాశాల ప్రిన్సిపాల్ మోహన్ దాస్ ను ఆదేశించారు.
ప్రీతి ఆత్మహత్యకు ముందు కేఎంసీ, ఎంజీఎం ఆస్పత్రిలో ఏం జరిగింది..ప్రీతికి కౌన్సిలింగ్ నిర్వహించిన వైద్యులు ఎవరు.. ప్రీతి ఆత్మహత్యకు అనస్థీషియా తీసుకోవడమే కారణమా..ఎంజీఎంలో ఎలాంటి వైద్యం అందించారు.. ఎవరి సూచన మేరకు ఆమెకు హైదరాబాద్ లోని నిమ్స్ కు తరలించారు. అనే అంశాలను కూడా నివేదించాలని ఆదేశించారు.
అలాగే ఐదేళ్ల కాలంలో కళాశాలలో ఏమైనా ర్యాగింగ్ ఘటనలు జరిగాయా..కళాశాలలో ర్యాగింగ్ జరగకుండా ఎలాంటి చర్యలు చేపడుతున్నారు. లాంటి వివరాలు కూడా ఇవ్వాలని గవర్నర్ లేఖలో పేర్కొన్నారు. గవర్నర్ ఆదేశాల మేరకు అన్ని వివరాలను నివేదిస్తామని శుక్రవారం కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్ దాస్ తెలిపారు.
ఇక ఇలా ఉంటే..మెడికో ప్రీతి మరణానికి సంబంధించిన ఫోరెన్సిక్ రిపోర్టులు పోలీసుల చేతికి అందాయి. గాంధీ ఆస్పత్రిలో ప్రీతికి చేసిన పోస్టుమార్టం ఆధారంగా ఫోరెన్సిక్ అధికారులు రిపోర్ట్ రెడీ చేసి వరంగల్ పోలీసులకు అందించారు. ఈ రిపోర్టులతో ప్రీతి మరణంపై ఉన్న సస్పెన్స్‌కు తెరపడనుండగా.. నివేదికలో ఏముందనే ఉత్కంఠ నెలకొంది.
మరోవైపు బ్లడ్ శాంపిల్స్ రిపోర్టు కూడా పోలీసులకు అందినట్లు తెలుస్తోంది. అదే విధంగా ప్రీతి కేసులో కస్టడీలో ఉన్న సైఫ్‌ను విచారిస్తున్నారు పోలీసులు. శుక్రవారం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు మట్టెవాడ పోలీసు స్టేషన్ లో ఏసీపీ బోనాల కిషన్ విచారణ జరపగా.. నిన్నసాయంత్రం హెడ్ క్వార్టర్స్‌లో కమిషనర్ పర్యవేక్షణలో విచారణ జరిగింది.
ఏ సమయంలో ఆస్పత్రిలో కలిసి డ్యూటీ చేశారు అనే కోణంలో ప్రశ్నించారు. సైఫ్ చెప్పిన విధంగా డ్యూటీ లిస్టులను పరిశీలించారు. అయితే సీనియర్‌ను కాబట్టి తనకు భయపడాలని ప్రీతితో అన్నానే తప్పా.. వేధించలేదని సైఫ్ పోలీసులకు చెప్పినట్లు సమాచారం.