తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు ఒక్క అవకాశం ఇవ్వండి అన్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. భద్రాద్రి ఇల్లందులో హాథ్ సే హాథ్ జోడో పాదయాత్రలో భాగంగా జెకెఓసిలో ఐఎన్టీయుసి జెండాను ఆవిష్కరించి పిట్ మీటింగ్ లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డిని సింగరేణి కాంట్రాక్టు కార్మికలు కలిశారు.
పర్మినెంట్ చేయాలని రేవంత్ రెడ్డికి కార్మికులు వినతి పత్రం అందజేశారు. రెగ్యులర్ కార్మికులను తొలగించి కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పెట్టి ప్రభుత్వం శ్రమ దోపిడీకి పాల్పడుతోందని మండిపడ్డారు రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర సాధనలో గని కార్మికుల పాత్ర ఎంతో ఉందన్నారు. ఒకప్పుడు 70 వేలు ఉన్న ఉద్యోగులు 40 వేలకు తగ్గిపోయారని, కమీషన్ల కక్కుర్తి కోసం ఓపెన్ కాస్ట్ గనులను ప్రయివేటుకు కట్టబెడుతున్నారని మండిపడ్డారు.
సింగరేణిని ప్రయివేటుపరం చేయొద్దని పార్లమెంటులో కేంద్రాన్ని నిలదీశామన్నారు.సింగరేణి ఆధీనంలో ఉన్న గనులను ప్రయివేటుకు అప్పగించి దోపిడీకి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గనులను ప్రయివేటుకు కట్టబెట్టి 25 వేల కోట్లు దోపిడీకి పాల్పడాలని చూస్తున్నారని అన్నారు. సింగరేణికి జెన్ కో 12 వేల కోట్ల బకాయి పడిందని స్పస్టం చేశారు.
అందుకే సింగరేణిలో కార్మికులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వీటన్నింటికి సిఎండీ శ్రీధర్ కారణం అని సంచలన వ్యాఖ్యలు చేశారు. క్రిమినల్ కేసులు ఉన్న అధికారి సిఎండీగా ఉండడానికి వీల్లేదని మండిపడ్డారు రేవంత్ రెడ్డి. రెండు మూడేళ్లు మాత్రమే ఆ స్థానంలో ఉండాల్సిన అధికారి ఏళ్లు గడుస్తున్నా సీఎండీగా కొనసాగుతున్నారని ఆరోపించారు. 10 నెలల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.