పర్యావరణానికి చేటు తెస్తున్న పాలిథిన్, ప్లాస్టిక్ వంటివాటిపై ఓ సర్పంచ్ కమ్ లాయర్ పెద్ద ‘యుద్ధమే’ ప్రారంభించాడు. జమ్మూ కశ్మీర్ అనంతనాగ్ జిల్లా లోని సాదివారా అనే గ్రామ పెద్దగా వ్యవహరిస్తున్న ఫరూక్ అహ్మద్ ఘనయ్ అనే ఈయన.. .. ప్లాస్టిక్ వ్యర్థాలను ఎక్కడంటే అక్కడ పారవేసేబదులు.. మీ ఇళ్లలోనే మీరు ‘గార్బేజ్ పిట్స్’ ని ఏర్పాటు చేసుకుని ఈ వ్యర్థాలను వాటిలో వేయాలని గ్రామస్థులకు సూచిస్తున్నాడు. పంటలు, పొలాల్లో ఈ వ్యర్థాలను పారవేయడం మానేసి ఇలా చేయాలని, పాలిథిన్, ప్లాస్టిక్ కవర్లవంటి వాటిని తనకు తెచ్చి ఇస్తే బంగారు నాణెం ఇస్తానని వారిలో అటు పర్యావరణ పరిరక్షణపై చైతన్యంతో బాటు సరికొత్త ఆశలను కూడా కలిగిస్తున్నాడు.
దాదాపు ఏడాది కాలంగా ఫరూక్ అహ్మద్ ఈ ‘ప్రచార యుద్దాన్ని’ కొనసాగిస్తున్నాడు. 20 క్వింటాళ్ల పాలిథిన్ తెచ్చి ఇస్తే ఓ గోల్డ్ కాయిన్ మీదే అవుతుందని, ఇంతకన్నా తక్కువ తెచ్చినా వెండి నాణెం మీకిస్తానని గ్రామస్థులకు చెబుతున్నాడు. సమాజ బాగు కోసం పనికి వచ్చే ఇలాంటి ఇన్నోవేటివ్ ఐడియాని సమర్థంగా అమలు చేసేందుకు ఇక్కడి యువకులు కూడా ఓ క్లబ్ ఏర్పాటు చేసుకున్నారు.
ఈ ఏడాది కాలంలో తమ గ్రామం పూర్తిగా మారిపోయిందని, లోగడ రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ పాలిథిన్ కవర్లు, చెత్త కనబడేదని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయి, గ్రామం పరిశుభ్త్రంగా కనబడుతోందని ర్ క్లబ్ వలంటీర్ మొహసిన్ అమీన్ సంతోషంగా చెబుతున్నాడు.
ఫరూక్ అహ్మద్ వినూత్న ఐడియా అనంతనాగ్ జిల్లాలోని గ్రామాల్లో అంతటా త్వరలో అద్భుతాలు సృష్టించనుంది. ఈ మోడల్ ని తాము అన్ని పంచాయతీల్లోనూ అమలు చేస్తామని, తమ గ్రామాలు పాలిథిన్ ఫ్రీ గ్రామాలుగా మారడానికి ఎక్కువ కాలం పట్టదని ఈ జిల్లా అసిస్టెంట్ కమిషనర్ డెవెలప్మెంట్ రియాజ్ అహ్మద్ షా చెప్పారు. జిల్ల్లాలో అప్పుడే తాము 60 వేల కంపోస్ట్ పోస్టులను ఏర్పాటు చేశామని, పర్యావరణ పరిరక్షణకు గ్రామస్థులందరిలో చైతన్యం తెస్తామని ఆయన చెప్పారు.