విశాఖ వేదికగా రెండు రోజుల పాటు జరిగిన ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు పూర్తయింది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలు , వనరులు, పరిస్థితులను దేశవిదేశాల నుంచి వచ్చిన పారిశ్రామిక వేత్తలకు ప్రభుత్వం వివరించింది. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. సదస్సును విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన పారిశ్రామికవేత్తలకు అభినందనలు తెలిపారు. మొత్తంగా 15 రంగాల్లో పెట్టుబడులు వచ్చాయన్న సీఎం.. సదస్సు విజయవంతం అయిందని సంతోషం వ్యక్తం చేశారు. గత మూడేళ్లలో ఏపీ ఆర్థికంగా ముందుకు వెళ్తోందని.. నూతన పారిశ్రామిక విధానాలు తీసుకొచ్చామని సీఎం జగన్ తెలిపారు.
ఏపీని పారిశ్రామిక హబ్ గా తీర్చిదిద్దుతామని చెప్పారు. పారదర్శక పాలనతో రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. 15 కీలక రంగాల్లో రాష్ట్రానికి పెట్టుబడులు రావడం అభినందనీయమన్నారు. చిత్తశుద్దితో అడుగులు వేస్తూ ముందుకెళ్తున్నామని.. గ్రీన్ ఎనర్జీకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు సీఎం చెప్పారు.
రెండు రోజుల సదస్సులో 352 ఒప్పందాలు జరగ్గా.. మొత్తం 13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని సీఎం జగన్ పేర్కొన్నారు. ఇక ఏపీలో నైపుణ్యం ఉన్న మానవ వనరులకు కొదువ లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. పారిశ్రామిక అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నారు. రోడ్లు, రైల్వే, పోర్టుల వంటి రంగాల్లో అభివృద్ధికి కేంద్రం కృషి చేస్తోందన్నారు.