సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం పెద్ద పట్నం కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఒగ్గు పూజారుల సంఘం ఆధ్వర్యంలో భక్తులు మల్లన్న క్షేత్రంలోని కల్యాణకట్ట వద్ద సోమవారం పెద్దపట్నం వేసి అగ్నిగుండం తయారు చేశారు.
స్వామి వారి పట్నం వారానికి వచ్చిన భక్తులు.. పెద్ద పట్నం, అగ్నిగుండం దాటి స్వామి వారిని దర్శించుకుంటున్నారు. అనంతరం నల్లపోచమ్మ, కొండపోచమ్మ ఆలయాలకు వెళ్లి అక్కడ అమ్మవార్లకు బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఉత్సవాల్లో ఎలాంటి అవంఛానీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.
కాగా పట్నం వారం సందర్భంగా ఆదివారం హైదరాబాద్ కు చెందిన 50 వేల మంది భక్తులు మల్లన్న క్షేత్రానికి తరలివచ్చి మొక్కులు చెల్లించుకొన్నారు. శనివారం సాయంత్రం నుంచే కొమురవెల్లికి చేరుకున్న భక్తులు ఆదివారం స్వామి వారిని దర్శించుకోవడంతోపాటు అభిషేకాలు, పట్నాలు, అర్చన, ప్రత్యేక పూజలు, ఒడి బియ్యం, కేశఖండన, గంగిరేగు చెట్టు వద్ద ముడుపులు కట్టడం వంటి కార్యక్రమాలు నిర్వహించారు.
స్వామి వారి సోదరి ఎల్లమ్మను దర్శించుకోవడంతోపాటు మట్టి పాత్రలతో అత్యంత భక్తిశ్రద్ధలతో బోనం సమర్పించారు. సోమవారం పెద్ద పట్నం వేసి, అగ్నిగుండాలు వేయనున్నారు. ఆలయ అధికా రులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.