రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ లోని సమతాస్ఫూర్తి కేంద్రంలో సమతామూర్తి అవతారమైన శ్రీరామానుజాచార్య సహస్రాబ్ది సమారోహం ఘనంగా ప్రారంభమైంది. అందులో భాగంగానే గురువారం ఉదయం శోభాయాత్ర ను నిర్వహించారు. ఈ శోభాయాత్రకు త్రిదండి చిన్నజీయరు స్వామితో పాటు.. వేలాది మంది భక్తులు హాజరయ్యారు. ఈ ఉత్సవాల్లో భాగంగా 5 వేల మంది వేదపండితులతో శ్రీలక్ష్మీనారాయణ మహా యజ్ఞం జరిగింది.
ఆశ్రమంలో ఏర్పాటు చేసిన 144 హోమశాలల వద్ద మహా యాగం నిర్వహించారు. పద్నాలుగు రోజుల పాటు కొనసాగనున్న ఈ మహా యజ్ఞానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. శ్రీరామానుజాచార్యులు సామాజిక, సాంస్కృతిక, లింగ, విద్య, ఆర్థిక వివక్ష నుంచి లక్షలాది మందికి విముక్తి కల్పించారని చిన్నజీయర్ స్వామి తెలిపారు. జాతీయత, లింగం, జాతి, కుల, మతాలకు అతీతంగా ప్రతి మనిషి సమానమని.. ప్రపంచమంతా ఒకే కుటుంబం అని అన్నారు.
వసుదైక కుటుంబం అనే దృక్పథాన్ని నిలబెడుతూ ఆయన వెయ్యవ జయంతిని సమానత్వపు పండుగగా జరుపుకుంటున్నామన్నారు చిన జీయర్ స్వామి. రామానుజాచార్యుల సహస్రాబ్ది సమారోహ వేడుకల్లో ప్రధానమైనది 216 అడుగుల ఎత్తైన శ్రీరామానుజాచార్య పంచలోహ విగ్రహావిష్కరణ. సమానత్వానికి ప్రతీకగా ఏర్పాటు చేసిన స్వామి వారి విగ్రహాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 5వ తేదీన ఆవిష్కరించనున్నారు.
దేశ రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, హోం మంత్రి అమిత్ షా సమారోహం వేడుకలకు హాజరవుతారు. ఈ నెల 13న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సమతామూర్తి బంగారు విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ఫిబ్రవరి 14న పూర్ణాహుతి 108 దివ్యదేశాల మూర్తుల ప్రాణప్రతిష్ఠ, శాంతి కల్యాణం జరుగుతాయని అన్నారు చిన జీయర్ స్వామి.