మతోన్మాద వ్యాఖ్యలు చేసిన యూపీ పోలీసులపై చర్యలు తీసుకుంటామని కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ తెలిపారు. గత శుక్రవారం మీరట్ లో పౌరసత్వ చట్ట వ్యతిరేక ర్యాలీ సందర్భంగా ఇద్దరు ముస్లింలను ”పాకిస్థాన్ కు వెళ్లండంటూ” మీరట్ ఎస్పీ అఖిలేష్ నారాయణ్ సింగ్ , మరో పోలీస్ అధికారి దూషించడాన్ని కొందరు మొబైల్ ఫోన్ లో రికార్డ్ చేశారు. ఆ వీడియోను ఓ ఛానల్ ప్రసారం చేసింది. దీనిపై స్పందించిన మంత్రి వీడియోపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. హింస ఏ స్థాయిలో ఉన్నా సహించేది లేదన్నారు. వారు పోలీసులైనా..అల్లరి మూకలైనా చర్యలు తప్పవని మంత్రి హెచ్చిరించారు. ఇది ప్రజాస్వామ్య దేశం కాదా..? పోలీసులు అమాయకులను ఇబ్బది పెట్టకుండా జాగ్రత్తపడాలని మంత్రి సూచించారు.
రెండు నిమిషాలున్న వీడియోలో ఎస్పీ నారాయణ్ సింగ్ వెంట మరో పోలీస్ అధికారి, ఇతర పోలీసులు ఓ ఇరుకైన గల్లీలో నడుస్తుంటారు. గల్లీలో ఓ దగ్గర టోపీలు ధరించిన ఇద్దరు ముస్లిం వ్యక్తులను ఆపి ఎక్కడికి వెళ్తున్నారు అని ప్రశ్నించారు. వాళ్లు నమాజ్ కు వెళ్తున్నామని చెప్పడంతో ఓకే మంచిది. మరి ఈ బ్లాక్, బ్లూ బ్యాడ్జెజ్ ఎందుకు పెట్టుకున్నారని ప్రశ్నించారు. ”వాళ్లను పాకిస్థాన్ వెళ్లమని చెప్పండి” అని తన కింది పోలీసులకు చెప్పారు. ఆ తర్వాత ”ఇక్కడ ఉండడం ఇష్టం లేకపోతే పాకిస్థాన్ కు వెళ్లండి…ఇక్కడికి వచ్చారు…ఎక్కడి పాటనో పాడుతున్నా”రని అన్నారు. ఆయన మాటలకు భయపడిపోయిన ఆ ముస్లిం యువకులు అవును సార్..”మీరు చెప్పింది కరెక్టే” అన్నారు. ఆ ఆఫీసర్ అక్కడి నుంచి వెళ్లిపోతూ వారి వైపు ఆగ్రహంగా చూశాడు…”ఇంటికొక్కడిని చొప్పున జైల్లో వేస్తా…ప్రతి ఒక్కడిని నాశనం చేస్తా’ అనుకుంటూ వెళ్లిపోయాడు.
గత శుక్రవారం జరిగిన హింసాత్మక సంఘటనలో ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో తాము వారిని అదుపు చేయడానికి చాలా ఇబ్బంది పడ్డామని పోలీసులు తెలిపారు. ఈ అల్లర్లలో ఆరుగురు చనిపోయారు.