రష్యా నుంచి గోవాకు చేరుకోవాల్సిన విమానానికి శనివారం తెల్లవారుజామున బాంబు బెదిరింపులు రావడంతో ఉజ్బెకిస్తాన్ కు దారి మళ్లించారు అధికారులు. రష్యాలోని పెర్మ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి గోవాకు వెళ్తున్న అజూర్ ఎయిర్ చార్టర్డ్ విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. విమానంలో సిబ్బందితో పాటు 240 మంది ప్రయాణికులు ఉన్నారు.
అధికారుల ప్రకారం ఈ విమానం తెల్లవారుజామున 4.15 గంటలకు దక్షిణ గోవాలోని దబోలిమ్ విమానాశ్రయంలో ల్యాండ్ కావాల్సి ఉంది. అజూర్ ఎయిర్ నడుపుతున్న ఈ విమానం (AZV2463) భారత గగనతలంలోకి ప్రవేశించకముందే దారి మళ్లించారని అధికారులు తెలిపారు.
రష్యా రాజధాని మాస్కోలోని పెర్మ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి గోవాకు వెళ్లే అజూర్ ఎయిర్ చార్టర్డ్ ఫ్లైట్‌కు భద్రతాపరమైన ముప్పు ఉన్నట్లు తెలిసింది. విమానంలో బాంబు అమర్చినట్లు దబోలిమ్ విమానాశ్రయ డైరెక్టర్ కు అర్ధరాత్రి 12.30 గంటలకు ఇమెయిల్ రావడంతో విమానాన్ని ఉజ్బెకిస్తాన్ కు మళ్లించారు.
11 రోజుల్లో మాస్కో-గోవా విమానానికి బాంబు బెదిరింపు ఘటన ఇది రెండోసారి. విమానంలో 7 మంది సిబ్బందితో సహా మొత్తం 240 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో ఇద్దరు శిశువులు కూడా ఉన్నారని విమానాశ్రయ అధికారులు తెలిపారు.